జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ పసలేని వ్యాఖ్యలు చేస్తున్నారని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. పవన్ అనుభవ రాహిత్యానికి ఆయన మాటలే నిదర్శనమని విమర్శించారు. పోలవరం రివర్స్ టెండరింగ్ అయ్యే వరకు పవన్ ఆగాలన్న మంత్రి బొత్స... ఆయన అవినీతిపరులకు కొమ్ముకొస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పవన్ ప్రశ్నించాల్సింది గత పాలకులను అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని దోచుకుతిన్న వారికి, అవినీతిపరులకు పవన్ వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు.
చవకబారు ఉపన్యాసాలు, పెయిడ్ ఆర్టిస్టులతో కార్యక్రమాలు తమవల్ల కాదని మంత్రి బొత్స అన్నారు. 100 రోజుల పాలనపై గెజిట్ విడుదల కోరడమే అవివేకమని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం విషయంలో వేల కోట్లు అవినీతి జరిగిందన్న మంత్రి బొత్స... అవినీతిని బయటకు తీయటానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని స్పష్టం చేశారు. ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత తమదని ఉద్ఘాటించారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాపాడుతామని పునరుద్ధాటించారు.
ఆడపిల్లలు బడికి వెళ్లలేక పోతున్నారంటే అది తమ తప్పుకాదని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధికి బాధ్యులమన్న మంత్రి బొత్స... ఏ ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే అంశం పరిశీలిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి... ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఎక్కడ తప్పు జరిగినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని సాంకేతికతతో ముందుకు వెళ్తున్నామని వివరించారు.
ఇదీ చదవండీ... పవన్ కల్యాణ్ అవినీతిని సమర్థిస్తారా..?