విశాఖ మన్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలే అధికం. ఇక్కడ పోలీసు ఉద్యోగమంటే...అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. అలాంటి పరిస్థితుల్లో నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ సామాజిక, చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నారు. మన్యంలో వివిధ రకాల కార్యక్రమాల ద్వారా సమస్యలను పరిష్కరించడం సహా.. గిరిజన యువతకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఆయా కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు. ఈ సేవలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో అత్యున్నత ప్రమాణాలతో నిర్వహించే కార్యక్రమాలకు అందజేసే... మూడు స్కోచ్ అవార్డులు జిల్లా పోలీసులను వరించాయి. అవార్డులకు ఎంపికైన మూడింటిలో... రెండు సామాజిక పోలీసింగ్ కార్యక్రమాలు ఉన్నాయి. స్థానిక యువకుల ఆసక్తిని గమనించి వారికి నచ్చిన రంగంలో శిక్షణ ఇచ్చి... స్వయం ఉపాధి పొందేలా చూస్తున్నారు. మహిళలకు టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్... యువతకు డ్రైవింగ్‌లో శిక్షణ ఇస్తున్నారు. ఈ అవార్డులను స్కోచ్ గ్రూప్ ఛైర్మన్ కొచ్చర్ చేతులు మీదుగా విశాఖ పోలీసు ఉన్నతాధికారులు దిల్లీలో అందుకున్నారు.
ఇదీ చదవండి: