మారుమూల ప్రాంతం... సౌకర్యాల లేమి... కూడికలు తీసివేతలు వంటి చిన్న లెక్కలు కూడా రాని స్థితిలో విద్యార్థులు... ఇదంతా విశాఖ పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో ఆశ్రమ పాఠశాల పరిస్థితి. తన పర్యటనలో ఇదంతా గమనించారు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కె. బాలాజీ. ముందుగా ఉపాధ్యాయులకు పూర్తి స్థాయిలో శిక్షణనిచ్చేలా సాంకేతికతపై దృష్టి సారించారు. సెల్ నెట్‌వర్క్ ఆధారంగా విజ్ఞాన్ వికాస్ పేరుతో ఐవీఆర్ఎస్ విధానం ప్రవేశపెట్టి... ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు.
ఆడియో పాఠాలతో
నిష్ణాతులైన ఉపాధ్యాయులతో కలిసి 2 నెలలు శ్రమించి పాఠ్య ప్రణాళిక ముఖ్యాంశాలతో 177 గంటల ఆడియో పాఠాలు సిద్ధం చేశారు. 17 మంది ఉపాధ్యాయులు ఇందులో భాగస్వాములయ్యారు. ఎస్సీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సిసోడియా 'విజ్ఞానం మీ కోసం' పేరుతో ఐవీఆర్ఎస్ సిస్టం ఆవిష్కరించారు. ఈ ఆడియో రికార్డ్ ప్రతిరోజు 2,300 మంది ఉపాధ్యాయులకు ఒకరోజు ఓ పాఠం చొప్పున పంపిస్తారు.
బోధన సరళం
మన్యం ప్రాంతంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సంబంధిత విభాగంలో ఉదయం లేదా సాయంత్రం ఫోన్ కాల్ వస్తుంది. ఇందులో ప్రణాళిక ప్రకారం రెండు లేదా మూడు నిమిషాల నిడివితో ఆడియో ప్రసారం అవుతుంది. దీన్ని ఉపాధ్యాయులు వింటారు. ముఖ్య సారాంశాన్ని గమనించి... పిల్లలకు పాఠాలు బోధించే సమయంలో ఈ సారాంశం చెప్పటంతో బోధన మరింత సరళీకృతమవుతుంది.
మన్యం వాసుల హర్షం
ఏజెన్సీ ప్రాంతంలోని విద్యావ్యవస్థలో మార్పు తీసుకురావడానికి ఐటీడీఏ అధికారి డీకే బాలాజీ చేస్తోన్న కృషిని మన్యం వాసులు అభినందిస్తున్నారు. ఉపాధ్యాయులు సాంకేతికత అందిపుచ్చుకొని అంకితభావంతో బోధన చేస్తే పిల్లల్లోనూ మార్పు వస్తుందని అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: