విశాఖ బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. సీఎం జగన్ ముఖ్య అతిథిగా, టెక్ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నానీ గౌరవ అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలోని విశ్వవిద్యాలయాల్లో ఏయూ 14వ స్థానంలో ఉండటం, వర్సిటీలో 459 బోధనా సిబ్బంది ఖాళీలు భర్తీ కావాల్సి ఉండడాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న విద్యా సంస్థల కోసం ఆలోచించాల్సిన అవసరం ఎంతో ఉందని ముఖ్యమంత్రి అన్నారు.
చదువుల దీపంతోనే కుటుంబాలకు వెలుగు, అభివృద్ధి వస్తుందని ముఖ్యమంత్రి ఈ సదస్సులో వ్యాఖ్యానించారు. ఆ దిశగా విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని చెప్పారు. ఆంగ్ల మాధ్యమంతో బోధనా సమస్యలు ఉంటాయన్న జగన్ అనుకున్న లక్ష్యాన్ని మాత్రం కచ్చితంగా చేరుకోగలమని ధీమా వ్యక్తం చేశారు. ఫీజు రీయంబర్స్మెంట్ నూరు శాతమిచ్చేందుకు కసరత్తు చేస్తున్నామని చెప్పారు.
ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన దిశగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గ్రంధి మల్లికార్జునరావు అభినందించారు. పూర్వ విద్యార్థుల సమాఖ్య నుంచి 50 కోట్ల రూపాయలు సేకరిస్తామని... దానికి జతగా మరో 50 కోట్ల రూపాయలను పూర్వ విద్యార్థుల సంఘానికి కేటాయించి వర్సిటీ అభివృద్ధికి సహకరించాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. టెక్ మహీంద్రా సీఈఓ గుర్నాని ఆంధ్ర విశ్వవిద్యాలయంతో కలిసి పని చేస్తామని తెలిపారు. ఏయూలో ఒక రోజు గడపడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు.
పూర్వ విద్యార్థుల సదస్సులు నిర్వహించడం ద్వారా వర్సిటీపై ప్రేమ, అభిమానాన్ని పెంచుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వర్సిటీని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత పూర్వవిద్యార్థులపై ఎంతో ఉందని సదస్సులో పాల్గొన్న వారు చెప్పారు.
పూర్వ విద్యార్థుల దినోత్సవం సందర్భంగా ఏయూ విద్యుత్ కాంతుల వెలుగులతో కళకళలాడింది. వర్సిటీలో ఎటు చూసినా పండుగ వాతావరణం నెలకొంది.
ఇవీ చదవండి...నేడు ఏయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం