అక్రమంగా తమ భూభాగంలోకి ప్రవేశించారని ఆరోపిస్తూ... ఇద్దరు భారతీయులను పాకిస్థాన్ అధికారులు అరెస్టు చేశారు. వీరిలో ఒకరు తెలుగు వ్యక్తైన....విశాఖకు చెందిన ప్రశాంత్ వైందం, మరొకరు మధ్యప్రదేశ్‌కు చెందిన వారిలాల్గా గుర్తించారు. ఈనెల 14న బహాపుల్‌పూర్‌లో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు అక్కడి పోలీసులు తెలిపారు. పాస్‌పోర్టు, వీసా లేకుండా రాజస్థాన్ సరిహద్దులో గల చోలిస్థాన్‌లోకి రావడానికి యత్నించారని చెప్పారు. పాక్ చట్టంలోని 334-4 కింద అభియోగాలు నమోదు చేశారు.
బహాపుల్‌పూర్‌లో నిర్బంధం...
ఈ నెల 14న బహావుల్‌పూర్‌లో వీరిని నిర్బంధంలోకి తీసుకున్నట్లు పాక్ పోలీసులు చెప్పారు. పాస్‌పోర్టు, వీసా లేకుండా చోలిస్థాన్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారని తెలిపారు. సర్దార్ యహాజమన్ మండి పోలీసు స్టేషన్ వద్ద అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్ సరిహద్దులకు చేరువలో చోలిస్థాన్ ఉంది. వీరిద్దరిపై పాకిస్థాన్ చట్టంలోని 334-4 కింద అభియోగాలు నమోదు చేశారు.
భారత్, పాక్‌ల మధ్య కొత్త లొల్లి!
ఈ వ్యవహారం భారత్, పాక్‌ల మధ్య దౌత్యపరంగా మరో వివాదానికి దారితీసే అవకాశం ఉంది. రాజస్థాన్‌లో థార్ ఎడారిలో వీచే ప్రచండ గాలుల వల్ల ఇసుక తిన్నెలు ఒక చోటు నుంచి మరోచోటుకు బదిలీ అవుతుంటాయి. ఫలితంగా భారత్-పాక్ సరిహద్దు వెంబడి ఉన్న కంచె కొన్నిసార్లు కనిపించదని భారత అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఆ ప్రాంతాన్ని సందర్శిస్తున్న పొరుగు దేశాలకు చెందిన కొందరు పొరపాటున సరిహద్దును దాటి పాక్‌లోకి అడుగుపెట్టిన సందర్భాలు గతంలో చోటుచేసుకున్నాయని వివరించాయి. తాజా కేసులోనూ ఇదే జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. భారత విదేశీవ్యవహారాల శాఖ దీనిపై ఇంకా స్పందించలేదు.
ఒకరు సాఫ్ట్‌వేర్ ఇంజినీరని!?
అరెస్టయిన ఇద్దరిలో ఒకరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని, అధునాతన ఉగ్రవాద దాడిని చేయడానికి వారిని పాక్ పంపారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అక్కడి మీడియాలో కథనాలు వచ్చాయి. ఆగస్టులో పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో రాజు లక్ష్మణ్ అనే ‘భారత గూఢచారి’ని అరెస్టు చేశారని ఆ కథనాలు పేర్కొన్నాయి. గూఢచర్యం ఆరోపణలపై భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌కు పాక్ సైనిక కోర్టు మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే.
పాక్ మీడియాకు ఇంటర్వ్యూ
పాకిస్థాన్‌లోని న్యాయస్థానం వద్ద అక్కడి మీడియా ప్రతినిధులు ప్రశాంత్‌ను ఇంటర్యూ చేశారు. ఇంగ్లిష్‌లో ప్రశ్నలు అడిగినప్పటికీ మాతృభాషలో స్పందిస్తానంటూ తెలుగులో మాట్లాడారు. ఆ ఇంటర్యూను పాక్ మీడియా ట్విట్టర్‌లో పెట్టింది.
మమ్మీ.. డాడీ.. బావున్నారా?
దీనిప్రకారం.. ‘‘మమ్మీ.. డాడీ.. బావున్నారా? ఇక్కడ అంతా బాగానే ఉంది. ఇప్పుడు నన్ను కోర్టుకు తీసుకొచ్చారు. నావల్ల ఏ సమస్యా లేదని నిర్ధరించుకున్నాకే ఇక్కడికి తెచ్చారు. ఇక్కడ నుంచి జైలుకు పంపుతారు. బెయిల్ కోసం ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ తర్వాత భారత రాయబార కార్యాలయానికి పంపుతారు. అప్పుడు భారత్, పాకిస్థాన్ వాళ్లు మాట్లాడుకుంటారు. దీనికి కొంత సమయం పడుతుంది. నన్ను ఇంకో నెలలో విడుదల చేయవచ్చు’’ అని ప్రశాంత్ చెప్పారు.
ఎవరీ ప్రశాంత్?
పాకిస్థాన్‌లోకి ప్రవేశించినట్లు చెబుతున్న ప్రశాంత్ ఎవరు.. సరిహద్దులు దాటి ఎందుకు వెళ్లారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఆ వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలంగాణ శాంతిభద్రతల అదనపు డీజీ జితేందర్ తెలిపారు. దీనికి సంబంధించి తమకు ఇంకా ఎలాంటి సమాచారం అందలేదన్నారు. అయితే అతడి స్వస్థలం విశాఖపట్నమని, రెండేళ్ల కిందటే ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
ఇదీ చూడండి: 'ఆర్టీసీ సమ్మెపై 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలి'