శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు సోమవారం నుంచి సాయంత్రం అయిదు గంటలకే మూతపడుతున్నాయి. అధికారులు, సిబ్బంది తాళాలు వేసి వెళ్లిపోతున్నారు. ఇకపై ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే అందుబాటులో ఉంటామని వారు స్పష్టం చేశారు. రెవెన్యూ అతిథి గృహంలో జిల్లా రెవెన్యూ సర్వీసుల సంఘం ఆధ్వర్యంలో పలు రెవెన్యూ శాఖల ఉద్యోగుల సంఘం ప్రతినిధులంతా మంగళవారం సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ఉన్నతాధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టెలీ, వీడియో కాన్ఫరెన్స్ అంటూ అదనపు గంటలు పని చేయిస్తున్నారని చెబుతున్నారు.
సమీక్ష సమావేశాలు జరిగినప్పుడు కలెక్టర్, ఐటీడీఏ పీవోలు తమను దూషిస్తూ మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని ఉద్యోగులు వాపోయారు. నిర్ణీత వేళలు పాటించాలని స్వయంగా ముఖ్యమంత్రే చెబుతున్నా జిల్లాలో మాత్రం అమలు చేయటం లేదంటున్నారు.
తీరు మారకుంటే పోరుబాట
ప్రజలకు సేవలు చేయాలని తమకు ఉన్నా టెలీ, వీడియో కాన్ఫరెన్స్ పేరుతో సమయం వృథా అవుతుందని చెబుతున్నారు. అందుకే సాయంత్రం 5 గంటలకే కార్యాలయాలు నుంచి వెళ్లిపోవాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తమపై ఒత్తిడి పెరుగుతున్న విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా మార్పు లేదని గతంలో ఈ జిల్లాలో పనిచేసిన వారెవరూ ఇలా ప్రవర్తించలేదని ఉద్యోగులు చెబుతున్నారు. ఇప్పటికైనా తీరు మారకుంటే మూకుమ్మడి సెలవులకు సిద్ధమని ప్రకటించారు.