రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం జిల్లాలో వీరఘట్టం, బూర్జ, పాలకొండ, పోలాకి, పొందూరు, జలుమూరు, ఇచ్చాపురంలో వర్షం కురిసింది. వజ్రపుకొత్తూరు, ఆమదాలవలస, సరుబుజ్జిలి, మందస, సంతబొమ్మాళిల్లో తేలికపాటి వాన పడింది. వరి నారు పోసేందుకు ఈ చినుకులు సరిపోతాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
విశాఖలో కురిసిన భారీ వర్షానికి నగరం చల్లబడింది. అయితే ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో ప్రజల మెుదల భయపడ్డారు. వర్షంతో రహదారులు జలమయం అయ్యాయి. కొద్ది రోజులుగా వర్షాలు లేక నగర వాసులు అల్లాడి పోతున్నారు. ప్రస్తుతం కురిసిన వర్షంతో ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు , పరిసర ప్రాంతాలలో ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. వర్షంతో పాటు భారీగా గాలులు వీయటంతో ప్రధాన రహదారి పక్కన చెట్లు పడిపోయాయి. ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురయ్యాయి.
తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. తొమ్మిదన్నర గంటలకు ప్రారంభమైన వాన ఎడతెరపి లేకుండా కురుస్తుంది. అధిక రద్దీ కారణంగా వైకుంఠం వెలుపల మూడు కిలోమీటర్లదూరం క్యూలైన్లలో భక్తులు భారులు తీరి ఉన్నారు. వర్షం కూరుస్తుండడంతో క్యూలైన్లలో తడుస్తూ నిరీక్షిస్తున్నారు.