సిక్కోలుకు జాలర్లు
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని మత్స్యకారుల గ్రామాల్లో ఆనందం వెల్లివిరిసింది. కుటుంబ పోషణ నిమిత్తం గుజరాత్‌లో చేపలవేటకు వెళ్లి పాకిస్థాన్ దళాలకు చిక్కిన జాలర్లు వస్తున్నారన్న వార్త ఆ పల్లెలకు పండుగ తెచ్చింది. గతేడాది బందీలైన వారిని తలచుకుంటూ ఆవేదనతో ముగిసిన సంక్రాంతి.. ఈఏడాది మత్స్యకారుల ఆగమనంతో ఆనందమయమైంది.
14 నెలలుగా ఎదురుచూపులు
14 నెలలుగా ఎప్పుడు విడుదలవుతారో.. ఎలా ఉన్నారో.. తెలియక.. దుఖసాగరంలో మునిగాయి ఆ మత్స్యకార కుటుంబాలు. ఆవేదనల మధ్య బతుకీడుస్తున్న బాధితుల్లో ఈ సంవత్సరం కొత్త ఉత్తేజాన్ని నింపింది. వీరు చేసిన విన్నపాలు నెరవేరి.. పాక్ చెరలో చిక్కిన జాలర్లు స్వస్థలానికి చేరుకుంటున్నారు. బందీలైన వారిలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం డీ మత్స్యలేశం, కే మత్స్యలేశం, బడివానిపేట, ముద్దాడ గ్రామాలకు చెందిన 15 మందితో పాటు విజయనగరం జిల్లా బోగాపురం మండలం బర్రిపాలెం, పూసపాటిరేగ మండలం తిప్పలవలస చెందిన ఐదుగురు మత్స్యకారులు ఉన్నారు. అప్పటి నుంచి బాధిత కుటుంబాలు ప్రజాప్రతినిధులను కలిసి వీరి విడుదలకు చర్యలు తీసుకోవాలంటూ విన్నవించారు.
ఎంపీల చొరవతో
మత్స్యకారులను విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జాలర్ల కుటుంబాలతో కలిసి విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి విదేశాంగశాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జై శంకర్‌ను కలిశారు. విదేశాంగశాఖ ప్రయత్నంతో పాకిస్థాన్ ప్రభుత్వం మత్స్యకారులను విడుదల చేసింది. తమ వారి రాక కోసం స్థానికులు, బాధిత కుటుంబసభ్యులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
ఇదీ చదవండి: