ఎన్నికల హామీలన్నీ భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లా భావిస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్ఘాటించారు. పాదయాత్రకు వచ్చినప్పుడు శ్రీకాకుళం జిల్లాలోని ప్రతి గ్రామంలో తిరిగానన్న సీఎం జగన్... చెప్పిన సమస్యలన్నీ విని తాను ఒకటే చెప్పానన్నారు. ''నేను విన్నాను... నేను ఉన్నానని'' చెప్పానన్న సీఎం... కిడ్నీ సమస్యపై ఇచ్చిన ప్రతి మాటనూ గుర్తుపెట్టుకున్నానని చెప్పారు. కిడ్నీ బాధితులకు పెన్షన్ రూ.10 వేలు ఇస్తూ మొదటి సంతకం చేశానని గుర్తు చేశారు.
200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, రీసెర్చ్ సెంటర్ తీసుకొస్తానని చెప్పానన్న సీఎం.. ఇవాళ శంకుస్థాపన చేశానని వివరించారు. డయాలసిస్ చేయించుకుంటున్న రోగులకు రూ.10 వేలు పింఛన్ ఇస్తున్నామని చెప్పారు. డయాలసిస్ వచ్చేముందుగానే స్టేజ్-3 బాధితులకు కూడా ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.5 వేలు పింఛన్ ఇస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి 500 మంది రోగులకు హెల్త్ వర్కర్లు ఉంటారన్న జగన్... కిడ్నీ బాధితులందరికీ ఉచిత బస్సు పాస్, ల్యాబ్‌లో పరీక్షలన్నీ ఉచితమని ప్రకటించారు.
పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని ప్రతిఒక్కరికి నేరుగా ఇంటింటికి శుభ్రమైన తాగునీరు అందిస్తామన్న ముఖ్యమంత్రి జగన్... మత్స్యకారుల కోసం జెట్టీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నామని చెప్పారు. ఫిషింగ్ జెట్టీతో పాటు అన్నిరకాల వసతులు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. చేపలను కాపాడుకునేందుకు శీతల గోదాములు, మత్స్యకారుల సామాన్లు భద్రపరుచుకునేందుకు షెడ్లు నిర్మిస్తామన్నారు.
సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తున్నామన్న సీఎం జగన్... యుద్ధప్రాతిపదికన మహేంద్రతనయ ప్రాజెక్టు పనులు చేయిస్తామని హామీఇచ్చారు. అవ్వ, తాతలకు ఇచ్చే పింఛన్‌ను పెంచి వారి రుణం తీర్చుకున్నానని పేర్కొన్నారు. వృద్ధాప్య పింఛన్‌ను ఏటా రూ.250 చొప్పున పెంచుతామని వివరించారు. అక్టోబర్ 15న రైతు భరోసాకు శ్రీకారం చుట్టబోతున్నామన్న ముఖ్యమంత్రి... ప్రతి రైతన్న చేతిలో రూ.12,500 పెట్టబోతున్నామని ప్రకటించారు.
మూడు నెలల కాలంలోనే 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని సీఎం జగన్ చెప్పారు. ప్రతి 50 ఇళ్లకు వాలంటీర్‌ను ఏర్పాటు చేసి రూ.5 వేలు వేతనం ఇస్తున్నామని వివరించారు. సంక్షేమ పథకాలన్నీ నేరుగా ఇంటికే వచ్చి అందించేలా ఏర్పాటు చేశామన్న జగన్... నవంబర్ 21న ప్రతి మత్స్యకార కుటుంబానికి రూ.10 వేలు ఇవ్వబోతున్నామని ప్రకటించారు. మగ్గమున్న ప్రతి చేనేత కుటుంబానికి రూ.24 వేలు ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు.
జనవరి 26న అమ్మఒడి పథకం తీసుకొస్తున్నామని సీఎం జగన్ ప్రకటించారు. కళాశాలలకు వెళ్లే ప్రతి విద్యార్థికి పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తామని హామీఇచ్చారు. తిత్లీ బాధితులకు పెంచిన పరిహారం శుక్రవారం నుంచే పంపిణీ చేస్తామని చెప్పారు. ఉగాదినాడు రాష్ట్రంలో 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నామన్న జగన్... ఇంటి స్థలం లేని ప్రతి అక్కచెల్లెమ్మకు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. శ్రీరామనవమి రోజున వైఎస్‌ఆర్ పెళ్లికానుక ఇవ్వబోతున్నట్లు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు.
నారాయణపురం ఆనకట్ట ఆధునీకరణ చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. సెప్టెంబర్ చివరినాటికి సొంత ఆటో ఉన్నవాళ్లకు రూ.10 వేలు ఇస్తామని చెప్పారు. మూడు నెలల కాలంలోనే అసెంబ్లీలో 19 చట్టాలు తీసుకొచ్చామన్న ముఖ్యమంత్రి... 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని చట్టం తీసుకొచ్చినట్లు వివరించారు. అక్టోబర్ 2న గ్రామ సచివాలయాలు తీసుకురాబోతున్నామని ప్రకటించారు. ప్రతి 2వేలమంది జనాభా ఉన్న గ్రామంలో సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఏ పని కావాలన్నా 72 గంటల్లోనే చేసిపెట్టేలా వాలంటీర్లు ఉంటారని చెప్పారు. ఇంటింటికీ నాణ్యమైన బియ్యం పంపిణీని పైలట్ ప్రాజెక్టు కింద ప్రారంభించారు.
ఇదీ చదవండీ... 'చంద్రబాబుకు పేరు వస్తుందనే.. జగన్ కక్ష'