ప్రకాశం జిల్లా ఒంగోలు కేశవరాజుకుంట ప్రాంతం నుంచి పాత జాతీయ రహదారికి వెళ్లే దారిలో.. ఒక మహిళ అపస్మారక స్థితిలో పడి ఉందని పోలీసులకు సమాచారం అందింది. వారు వచ్చి 108 వాహనంలో బాధితురాలిని రిమ్స్‌కు తరలించారు. ఆమె ఎవరు? ఆమెను నిర్జన ప్రదేశంలోకి ఎవరు తీసుకువెళ్లారు. అక్కడ ఏం జరిగింది? అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. సంఘటనా స్థలంలో ఆమె దుస్తులు, చెప్పులు, సంతనూతలపాడు నుంచి ఒంగోలుకు ప్రయాణించినట్లుగా బస్సు టిక్కెటు, స్థానిక థియేటర్‌లో మంగళవారం రాత్రి మొదటి ఆట సినిమా టిక్కెట్లు దొరికాయి. సంఘటనా స్థలంలో నల్లపూసల దండతో పాటు మరికొన్ని వస్తువులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసింది.
నిందితులెవరు..?
హతురాలిది ఒంగోలు శ్రీనగర్ కాలనీగా పోలీసులు గుర్తించారు. పేర్నమిట్టకు చెందిన ఈమె కొన్నాళ్ల క్రితం భర్తతో విడిపోయి శ్రీనగర్ కాలనీలో ఒంటరిగా నివసిస్తోంది. మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి... తిరిగి ఇంటికి చేరలేదని విచారణలో వెల్లడైంది.
ఆ బియ్యం ఎక్కడివి..
బాధితురాలిని ఆసుపత్రికి తీసుకువచ్చిన సమయంలో ఊపిరితిత్తులు, జీర్ణాశయంలో బియ్యం ఉన్నట్లు గుర్తించారు. అయితే నేర స్థలాన్ని పోలీసులు సందర్శించినప్పుడు అక్కడ ఎక్కడా బియ్యం జాడ కనిపించలేదు. మద్యం తాగి ఆ మత్తులో ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆ విషయం బయటకు వస్తుందనే నెపంతో ఈ దురాగతానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇవీ చదవండి: