ప్రకాశం జిల్లాలో ట్రాక్టర్లు దొంగిలించే ముఠా రైతులకు కునుకులేకుండా చేస్తోంది. ప్రకాశం జిల్లాకు చెందిన ఐదుగురు సభ్యుల ముఠా... పథకం ప్రకారం ట్రాక్టర్లు, ట్రక్కులు దొంగలిస్తోంది. కందుకూరు శ్రీనివాసకాలనీకి చెందిన గోను మాధవరావు రైతుల దగ్గర కూలీకి చేరేవాడు. రైతులకు మాయ మాటలు చెప్తూ నమ్మకంగా వ్యవహరించేవాడు. రైతులు పొలంలో ట్రాక్టర్లు పెట్టి ఇంటికి వెళ్లే సమయం కోసం ఎదురుచూసేవాడు. ఆ సమయం రాగానే మిగిలిన ముఠా సభ్యులు ఈర్ల సుబ్బారావు, షేక్ అబ్దుల్, తోట వెంకట రంగ, అహ్మద్ మోహిద్దీన్‌ను పిలిచేవాడు. అక్కడి నుంచి ట్రాక్టర్‌తో పరారయ్యేవారు.
ఇలా చాలాచోట్ల చోరీలకి పాల్పడ్డారు. ఆయా మండలాల రైతులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ట్రాక్టర్లు, ట్రక్కులు దొంగిలిస్తున్న ఐదుగురు నిందుతులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.25 లక్షలు విలువ చేసే 9 ట్రాక్టర్లు, 3 ట్రక్కులు స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన ట్రాక్టర్లు, ట్రక్కులు నెంబర్ ఫ్లేటు మార్చి విక్రయించడం, గ్యాస్ కట్టరుతో ముక్కలు ముక్కలు చేసి ఇనుముగా అమ్ముకునేవారు. వారి నుంచి గ్యాస్ బండ, కట్టర్ స్వాధీనం చేసుకున్నారు.