అధికారుల తీరు వలన తమకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ పలువురు తెలుగు భాషా పండితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ స్పందన కార్యక్రమంలో కలెక్టర్ని కలిసి తమ సమస్య పరిష్కరించాలని కోరారు. పదోన్నతుల విషయంలో బీసీలకు రిజర్వేషన్ ఉండదన్న విషయం మరిచి కౌన్సిలింగ్ నిర్వహించటంతో మెరిట్ జాబితాలో ముందున్న తమకు అన్యాయం జరిగిందంటూ వాపోయారు. హిందీ భాషా పండితుల పదోన్నతుల విషయంలో అవలంభించిన విధానం అమలుచేయాలని కోరారు. పదోన్నతులు రద్దు చేసి తిరిగి కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. భాషా పండితులకు కేటాయించిన 12వేల ఖాళీలలో ఎస్జీటీలకు అవకాశం కల్పించటం వల్ల అసలైన తెలుగు పండితులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు. తెలుగు పండితుల విషయంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు సరికాదని మహిళా ఎల్పీ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: తెలుగును విస్మరిస్తే మట్టిలో కలిసిపోతారు: పవన్