ఎవరిపైనైనా అభిమానముంటే.. ఏం చేస్తాం. మహా అయితే ఎప్పుడో ఓ సారి తలచుకుంటాం. కానీ ఓ బ్యాంకు ఉద్యోగి అందుకు భిన్నం. అభిమానించే మోదీ ఫొటోలను.. దాచిపెట్టడం ఉద్యమంలా చేస్తున్నాడు. సేకరించిన వాటిని జాగ్రత్తగా భద్రపరుస్తారు. అలా ఇప్పటివరకు పది వేల చిత్రాలు సేకరించారు. ఆయన పేరే మందటి వెంకట నారాయణరెడ్డి. నారాయణరెడ్డి స్వస్థలం మార్కాపురం మండలంలోని చింతకుంట గ్రామం. ఆర్మీలో 18 ఏళ్ల పాటు వైర్లెస్ ఆపరేటర్గా విధులు నిర్వహించారు. పంజాబ్ గుజరాత్ సరిహద్దుల్లో సేవలందించారు. తర్వాత కొంతకాలం హిందీ ఉపాధ్యాయుడిగా ఓ ప్రైవేటు పాఠశాలలో పని చేశారు. అనంతరం ప్రకాశం జిల్లా చీరాలలోని కెనరా బ్యాంకులో క్లర్క్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తండ్రి అనంతయ్య విశ్రాంత ఉపాధ్యాయుడు ఆయన తరచూ జనసంఘ్ గురించి కుమారుడికి గొప్పగా చెప్పేవారు. దాని నుంచి వచ్చే నేత దేశాన్ని తమదైన శైలిలో పరిపాలిస్తారని అంటుండే వారు. ఆ మాటలు నారాయణ రెడ్డి మనసులో బలంగా నాటుకుపోయాయి.
డైరీ రాయడంలోనూ వినూత్నం
2014లో నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం.. తనదైన శైలిలో పాలన సాగిస్తూ ఉండడంతో తండ్రి మాటలు గుర్తొచ్చి మోదీపై అధ్యయనం ప్రారంభించారు. ఆ క్రమంలోనే ఆయన చరిత్రను చిత్రాల రూపంలో భద్రపరచాలని నిర్ణయించారు. నారాయణ రెడ్డిలో మరో విశేషం ఉంది. డైరీలో మనం రోజువారీ విశేషాలను రాస్తుంటాం. నారాయణరెడ్డి మాత్రం జర్మన్పేపర్లో మార్కర్ పెన్‌తో ఓపికతో రాసి భద్రపరుస్తారు. ఆ పేపర్‌ను ఒక దానికి ఒకటి అతికించి ఒక రీల్ గా రూపొందించారు. ప్రస్తుతం దాని పొడవు 333 అడుగులు. 15 కిలోలు పైగా బరువు.
మోదీని కలిసేందుకు వెళ్లీ..!
తాను ఎంతో ఆసక్తిగా సేకరిస్తున్న చిత్రాలను ప్రధాని నరేంద్ర మోదీకి స్వయంగా చూపించాలన్నది నారాయణరెడ్డి లక్ష్యం. ఇందుకోసం హైదరాబాద్‌కు చెందిన భాజపా నాయకుడు షాజహాన్ నాటి ఎమ్మెల్యే కిషన్ రెడ్డి(ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి) తదితరులను కలిసి తన ఉద్దేశం తెలియజేశారు. అతి కష్టం మీద గతేడాది జులైలో ప్రధాని అపాయింట్మెంట్ సంపాదించారు. దిల్లీ వెళ్లాక అదేరోజు మోదీ.. ఇతర రాష్ట్రాల పర్యటనకు వెళ్లడంతో కలిసే అవకాశం తప్పింది.
నారాయణ రెడ్డి ఇలా చేస్తుంటే.. కొంతమంది ఎగతాళి చేసిన వారున్నారు. అయినా పట్టించుకోకుండా ముందుకెళ్లారు. మోదీ వ్యక్తిగత విశేషాలు, రాజకీయానికి సంబంధించిన చిత్రాలు ఆయన సేకరణలో ఉన్నాయి. వీటితో రెండు ఆల్బమ్స్ రూపొందించారు నారాయణరెడ్డి. ప్రస్తుతం మరో ఆల్బమ్ తయారీకి సిద్ధమవుతోంది. ఎప్పటికైనా ప్రధాని మోదీని కలిసి తన ఆల్బమ్‌ను చూపించడమే ధ్యేయమంటున్నారు నారాయణరెడ్డి.
ఇదీ చదవండి: తాగిన మత్తులో నాగుపాముకు ముద్దు ఇచ్చాడు.. తర్వాత ఏమైంది?