ప్రకాశం జిల్లా చీరాలలో రోజురోజుకూ కుక్కకాటు బాధితుల సంఖ్య పెరుగుతోంది. చీరాల, ఈపురుపాలెం, వేటపాలెంలో ప్రధాన రహదారులు, వీధుల్లో తిరుగుతూ... కనిపించిన వారి అందరిపై దాడికి పాల్పడుతున్నాయి. పిల్లలు,పెద్దలు, వృద్ధులు ఇంటి నుంచి బయటికి రాకుండా బెంబేలెత్తిపోతున్నారు. వాహనాలకు అడ్డుగా వస్తున్న కారణంగా...చాలా మంది ద్విచక్రవాహనదారులు ప్రమాదాల బారిన పడ్డారు. ఇలా ఒకరిద్దరు కాదు వందల సంఖ్యలో బాధితుల సంఖ్య ఉంటుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే... చీరాల ఏరియా వైద్యశాలలో ర్యాబిస్ వేక్సిన్ లేక కుక్కకాటు బాధితులు ఆందోళన చెందుతున్నారు. చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చినా... వేక్సిన్ లేక ఎంతో మంది వెనుదిరిగి వెళ్తున్నారు. బయట వ్యాక్సిన్ కొనుగోలుకు ఒక్కోదానికి 400 రూపాయలు చెల్లించాల్సి వస్తుందని చెబుతున్నారు. పేదవారికి వైద్యం అందక మరింత ఇబ్బంది పడుతున్నారు. గత ఏడాది స్టేట్ సెంట్రల్ డ్రాగ్ స్టోర్స్ నుండి రావాల్సిన వ్యాక్సిన్ అరకొరగానే వస్తున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి కుక్కకాటు విరుగుడు మందు చీరాల ప్రభుత్వ వైద్యశాలలో అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇవీ చదవండి