కలసిరాని కాలంతో పోరాటం... వెంటాడిన కరువుతో ఎదురీదటం... అందిన కాడల్లా అప్పులు చేయటం... చివరికి కన్నీటితో ఇల్లు చేరటం... ఇదీ పసుపు రైతు దీనగాథ. తొలకరి పలకరింపుతో కోటి ఆశలతో సాగులోకి దిగాడు రైతన్న. అది అడియాసేనని అనతికాలంలోనే తేలిపోయింది. కరువు కోరలు చాచటం రైతును కలచివేసింది. అయినప్పటికీ.. మొక్కవోని దీక్షతో ముందుకు సాగాడు.
పెరిగిన పెట్టుబడి... తగ్గిన దిగుబడి
పసుపు పంటకు పెట్టుబడి గణనీయంగా పెరిగిపోయింది. ఒకప్పుడు వేలల్లో ఉండే ఖర్చు... ఇప్పుడు లక్షలకు చేరింది. విత్తు విత్తడం నుంచి మొదలుకొని పంట చేతికొచ్చే వరకూ సాగు ఖర్చుతోనే ముడిపడి ఉంది. కూలీల కొరత వీటన్నింటినీ అధిగమిస్తోంది. కూలీల రేట్లు గతంతో పోలిస్తే పదిరెట్లు పెరిగిపోయాయి. వీటన్నిటికీ ఓర్చి సాగులోకి దిగితే దిగుబడి మాత్రం నేలచూపులు చూస్తోంది. ఎకరానికి 150 నుంచి 160 క్వింటాళ్ల వరకూ పచ్చి పసుపు దిగుబడి రావాలి. అదే ఉడకబెట్టిన వట్టి పసుపు అయితే 40 నుంచి 50 క్వింటాళ్ల వరకూ దిగుబడి రావాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఇది సగానికి పడిపోయింది.
"అడుగంటిన" ఆశలు...
నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలో ప్రతిఏటా పసుపు పంటను అధికంగా సాగు చేస్తారు. కొండ కింద పల్లెల్లో రైతులు ఎక్కువగా మక్కువ చూపుతారు. ఈ ఏడాది కూడా బజ్జపల్లి, కృష్ణారెడ్డిపల్లి, లింగమనేనిపల్లి, దేకురుపల్లి, పుల్లయపల్లి గ్రామాల్లో సుమారు 250 ఎకరాల్లో పసుపు సాగు చేశారు. ఒక్కో ఎకరాకు లక్ష రూపాయల వరకూ పెట్టుబడి పెట్టారు. పంట చేతికొచ్చే సమయంలో భూగర్భ జలాలు అడుగంటాయి. పొలాల్లోని బోర్లన్నీ ఒట్టి పోయాయి. అన్నదాత అశలన్నీ ఇంకిపోయాయి. వచ్చిన అరకొర దిగుబడిని అమ్ముకోవాలంటే... మద్దతు ధర వెక్కిరిస్తోంది.
ప్రతిఇంట్లో పచ్చదనం నింపే పసుపు రైతు కంట్లో చివరికి కన్నీరే మిగులుతోంది.
ఇదీ చదవండీ: కరుగుతున్న మంచు.. ముంచుకొస్తున్న ప్రమాదం