పనికి వెళ్తే గానీ పూట గడవని జీవితాలు.. ఇసుక కొరతతో, ఆకలితో అలమటిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ సమస్య నెల్లూరులో తీవ్రంగా ఉంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి 60 వేల మంది కూలీలు నెల్లూరుకు వలసొచ్చి పదిహేను సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల నుంచి వలస వచ్చినవారు మరో 20 వేల మంది ఉంటారు. వీరంతా నగర శివార్లలో అద్దెలకు ఉంటున్నారు. రోడ్లు, భవన నిర్మాణ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రతి ఇంటిలో ముగ్గురు, నలుగురు ఉంటే అందరూ ఏదో ఒక పనికి వెళ్తారు. ఇసుక కొరత లేనంత వరకు ఒక్కొక్కరికి 500 రూపాయలు కూలీ దొరికేది. కొరత ప్రారంభమైన తర్వాత వీరి జీవితాల్లో ఆకలి రోజులు మొదయ్యాయి. ఒక్కరోజైనా కూలీ దొరుకుతుందనే ఆశతో.. స్టోనస్ పేట, ఆత్మకూరు బస్టాండ్, కొండాయిపాలెం గేటు వద్ద.. వందల సంఖ్యలో నిత్యం పడిగాపులు కాస్తున్నారు.
ఇసుక కొరతతో భవన నిర్మాణాలు స్తంభించి.. కుటుంబాలను పోషించడం కష్టంగా ఉందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిరాణా దుకాణాల వాళ్లు రెండు నెలలు అప్పు ఇచ్చారనీ.. తర్వాత వాళ్లూ ఇవ్వడం మానేశారన్నారు. ఇంటి అద్దె, విద్యుత్ బిల్లు. ఇలా ఏది చెల్లించాలన్నా చేతిలో రూపాయి లేదని కూలీలు వాపోతున్నారు. పిల్లలకు పాఠశాల ఫీజులు కూడా చెల్లించలేక... నానాపాట్లు పడుతున్నామని అంటున్నారు.
కూలీల్లోని ఉత్తరాంధ్ర జిల్లాల మహిళలు లోలాకులు, చెంపసవరాలు, బులాకీలు, ముక్కు పుడకలు, చేతి కంకణాలు ధరిస్తారు. అది వారి ఆచారం. ఎటువంటి పరిస్థితుల్లోనూ వాటిని తీయరు. అలాంటిది.. కుటుంబం ఆకలితో అల్లాడుతుంటే చూస్తూ ఊరుకోలేక, అప్పులోళ్ల వద్ద పరువు కాపాడుకునేందుకు.. వాటిని అమ్ముకుంటున్నారు. తమ కష్టాలు తీరాలంటే... ప్రభుత్వం ఇసుక కొరతను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని భవన నిర్మాణ కార్మికులు కోరుతున్నారు. అప్పటివరకు నెలకు 5 వేల రూపాయలైనా ఇస్తే..... అద్దెలు కట్టుకుంటామని ప్రాధేయపడుతున్నారు.
ఇదీ చదవండి