నెల్లూరు రాజకీయంపై సాక్షాత్తూ అధికార పార్టీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైకాపాలో కలకలం రేపుతున్నాయి. మంత్రి అనిల్‌ను, గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డిని ఉద్దేశించే ఆనం ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని వైకాపాలో అంతర్గతంగా చర్చ సాగుతోంది. ఆనం అసహనానికి అనేక కారణాలున్నాయనీ వైకాపా శ్రేణులుఅంచనావేస్తున్నాయి. 40ఏళ్లుగా ఆనం కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న V.R కళాశాలలో...ఇటీవల మంత్రి అనిల్ , ఎమ్మెల్యే కోటంరెడ్డి సమావేశాలు నిర్వహించి కమిటీని వేస్తామని ప్రకటించారు. ఇది ఆనంకు ఆగ్రహం తెప్పించిందనే చర్చ నడుస్తోంది. ఇటీవల జిల్లా సాగునీటి సలహా బోర్డు సమావేశంలో నీటిపారుదల కాల్వలు సరిగా లేవని, నీటి లెక్కలు తేల్చాలని రామనారాయణ రెడ్డి లేవనెత్తడం మంత్రి అనిల్‌కు కోపం కల్గించినట్లు భావిస్తున్నారు.మరోవైపు రెండుసార్లు సంప్రదించినా... సీఎం జగన్ అప్పాయింట్‌మెంట్ దొరకనందునే ఆనం జిల్లా నేతలపై విమర్శలు ఎక్కుపెట్టారనే చర్చకూడా వైకాపా వర్గాల్లో జరుగుతోంది.
ఆనం వ్యాఖ్యలపై వైకాపా అధినేత జగన్ ఘాటుగానే స్పందించారు. నెల్లూరు జిల్లాకు చెందిన నేత బీదా మస్తాన్‌రావు వైకాపాలో చేరిన అనంతరం విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి అనిల్ సహా పలువురు నెల్లూరు జిల్లా నేతలతో జగన్ సమావేశమయ్యారు.
పార్టీ అంతర్గత విబేధాలపై నేరుగా మీడియాకు ఎక్కడమేంటని ప్రశ్నించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను సహించబోనన్న జగన్ మరోసారి ఇలా చేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సి వస్తుందని సీఎం హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఆనంతో మాట్లాడాలని జిల్లా ఇంఛార్జి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, విజయసాయి రెడ్డికి సూచించినట్టు తెలుస్తోంది.
సంజాయిషీ నోటీసు జారీ చేయాలని...అంతకంటే ముందే ఆనంతో మాట్లాడాలని పార్టీ క్రమశిక్షణా వ్యవహారాల కమిటీ చైర్మన్ వరప్రసాదరాజుకు కూడా సూచించినట్టు సమాచారం. అధినేత ఆదేశాలను ఎవరు ధిక్కరించినా... చర్యలు తప్పవని విజయసాయిరెడ్డి హెచ్చరించారు.
ఇసుక విషయంలో ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డిపై గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఇటీవలే ఘాటైన.. విమర్శలు చేశారు. ఇప్పుడు ఆనం కూడా సొంతపార్టీ నేతల తీరును బాహాటంగానే తప్పు పట్టడం... వైకాపా అంతర్గత విభేదాలకు అద్ధంపడుతోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇదీచదవండి