కర్నూలు జిల్లా డోన్ మండలం యూ.కొత్తపల్లి జాతీయ రహదారికి ఆనుకుని ఉంటుంది. ఈ గ్రామానికి చెందిన నబి సాహెబ్ అనే వ్యక్తి... సర్వే నంబర్ 331/1లో ముస్లింల శ్మశానం కోసం నాలుగున్నర ఎకరాల స్థలాన్ని ఇచ్చారు. కొన్నేళ్లుగా అక్కడ చనిపోయిన వారికి అంత్యక్రియలు జరుగుతున్నాయి. అయితే మూడేళ్ల క్రితం ఈ భూమిని అక్రమార్కులు కబ్జా చేశారు. బ్యాంకులో క్రాపులోనూ తెచ్చుకున్నారు.
ఈ విషయం బ్యాంకు అధికారుల ద్వారా తెలుసుకున్న గ్రామస్థులు... శ్మశాన స్థలాన్ని వేరే వ్యక్తుల పేర్లమీదకి ఎలా మారుస్తారంటూ... మండిపడ్డారు. ఇదే కాదు శ్మశానానికి చుట్టుపక్కల కనిపించిన పొలాల రికార్డులను సైతం కబ్జారాయుళ్లు రెవెన్యూ అధికారుల అండతో... తమ కుటుంబసభ్యుల పేర్లమీదకి బదలాయించుకున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై తహసీల్దార్‌తో సహా కలెక్టర్‌కు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేనది గ్రామస్థులు చెప్పారు.
'ఈనాడు- ఈటీవీ' కథనాలకు స్పందన...
శ్మశానం కబ్జా వ్యవహారంపై శుక్రవారం 'ఈనాడు- ఈటీవీ'లో... ''శ్మశానాల్లో చెట్టాపట్టాల్'', "శ్మశానాన్నీ వదల్లేదు" శీర్షికన కథనాలు ప్రచురితమయ్యాయి. స్పందించిన డోన్ తహసీల్దార్ నరేంద్రనాథ్ రెడ్డి గ్రామానికి వెళ్లి శ్మశాన స్థలాన్ని పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. శ్మశాన స్థలానికి పాస్ బుక్కులు చేసుకోవడం వాస్తవమేనని తహసీల్దార్ నరేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. తక్షణమే ఈ సర్వే నంబర్‌తో ఉన్న వివరాలన్నింటినీ ఆన్లైన్, రెవెన్యూ రికార్డుల నుంచి తొలగిస్తామన్నారు. 2 రోజుల్లో శ్మశాన స్థలానికి హద్దులు ఏర్పాటు చేస్తామన్నారు. అవినీతికి పాల్పడిన అధికారిని గుర్తించి... చర్యలు తీసుకునేలా కలెక్టర్‌కు నివేదిక పంపుతామని వెల్లడించారు.