టిక్ టాక్ ముసుగులో వివాహిత అర్చన అదృశ్యమైన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. జిల్లాలోని ఆదోని పట్టణం కిలిచినపేటకు చెందిన అర్చనకు అంజలి అనే మహిళ టిక్ టాక్ ద్వారా పరిచయమైంది. వీరి స్నేహం ఒకరి ఇంటికి మరొకరు వెళ్లే వరకూ వచ్చింది. అర్చనకు కర్ణాటక ప్రాంతానికి చెందిన రవితో 13 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు మగ పిల్లలు సంతానం. భర్త డ్రైవర్ కావడంతో వారానికి రెండు, మూడు రోజుల మాత్రమే ఇంటి దగ్గర ఉండేవారు. కొన్ని నెలల క్రితం అర్చన తన పుట్టినిల్లు ఆదోనికి వచ్చినప్పుడు తనతోపాటే అంజలి కూడా వచ్చింది. భర్త లేని సమయంలో ఇంటికి వచ్చి ఉండేదని కుటుంబ సభ్యులంటున్నారు. ఆ మహిళ వేషధారణ కూడా తేడాగా ఉందని... ఎప్పుడూ చొక్కా, ప్యాంట్ ధరిస్తుందని బంధువులు తెలిపారు. అంజలి ఆడపిల్ల కావడంతో ఇంట్లో ఉంచుకున్నామని కుటుంబ సభ్యులంటున్నారు. నాలుగు రోజుల క్రితం అర్చనతో పాటు ఇద్దరు పిల్లలు అదృశ్యం కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. అర్చన, పిల్లలను అంజలి అపహరించి ఉంటుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అదృశ్యమైన తమ కుమార్తె, పిల్లల ఆచూకీ తెలుసుకోవాలని పోలీసులను కోరుతున్నారు.
ఇదీ చదవండీ: