వైకాపా ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం ఎంతో ముఖ్యమని రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. దిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన... బడ్జెట్‌లో ముఖ్యమైన రంగాలకే పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారు. జీఎస్టీ మండలి సమావేశం అజెండాలో ఏపీ విషయాలు పెద్దగా లేవని పేర్కొన్నారు. రైతు భరోసాకు వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామన్న బుగ్గన... రుణమాఫీ విషయంలో గతప్రభుత్వ విధానాన్ని తాము పాటించమని చెప్పారు. పన్నుల విధింపును చాలా జాగ్రత్తగా చూడాలని ఆర్థికమంత్రి అభిప్రాయపడ్డారు. ఒకవైపు ఆదాయం, మరోవైపు ప్రజల అవసరాలు చూడాలన్న బుగ్గన... ప్రజలపై విచ్చలవిడిగా పన్నులు విధించకూడదని పేర్కొన్నారు.
విభజన వల్ల జరిగిన నష్టం, రావాల్సిన నిధుల గురించి కేంద్రానికి చెప్పామని బుగ్గన తెలిపారు. గతప్రభుత్వం కేంద్రంలో భాగస్వామిగా ఉన్నా రూ.4 వేల కోట్లే తెచ్చుకోగలిగిందన్న ఆర్థిక మంత్రి... రైతులకు వడ్డీలేని రుణాలకు రాష్ట్రం చెల్లించే వాటాను కేంద్రమే చెల్లించాలని కోరామని తెలిపారు. పీఎం కిసాన్ యోజన కింద ఇస్తున్న రూ.6 వేలు పెంచితే బావుటుందని చెప్పామన్న బుగ్గన... స్వయం సహాయ సంఘాలకు రాష్ట్రం చెల్లించే వాటాను భరించాలని కోరామన్నారు. రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టాలు, ఆర్థిక లోటు గురించి కేంద్రానికి వివరించామని తెలిపారు.
పూర్తిగా వ్యవసాయాధారిత రాష్ట్రం కాబట్టి సహకరించాలని కోరామన్న మంత్రి... పోలవరం, రాజధానికి ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కోరినట్లు తెలిపారు. వచ్చే జీఎస్‌టీ మండలి భేటీలో రాష్ట్ర అంశాలు ఉండేలా చూస్తామన్నారు. కేంద్ర బడ్జెట్ పరిశీలించాక రాష్ట్ర ఆదాయ వనరులను చూసుకుంటామన్న బుగ్గన... జీఎస్టీ వచ్చాక కొత్త ఆదాయ వనరులు తగ్గాయని వివరించారు. రెవెన్యూ లోటు రూ.16 వేల కోట్లు అనే సాకును గత ప్రభుత్వం చూపించిందని విమర్శించిన రాజేంద్రనాథ్‌రెడ్డి... కేంద్రం ఏమీ ఇవ్వకపోవడం వల్లే రాష్ట్రంలో పనులు చేయలేకపోయాం అన్నట్లు తెదేపా నేతలు చెప్పారని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండీ...