రాష్ట్ర మాజీమంత్రి భూమా అఖిలప్రియ మీద కేసు నమోదైందన్న వార్తలపై ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి స్పందించారు. ఇందులో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండల పరిధిలో... వెయ్యి గజాల స్థలం 2016లో భూమా నాగిరెడ్డి కొందరికి విక్రయించినట్లు తెలుస్తుంది. ఆ సమయంలో తాను మైనర్‌గా ఉన్నందున తనకు సమాచారం ఇవ్వకుండానే స్థలాన్ని విక్రయించారని భూమా విఖ్యాత్ రెడ్డి కోర్టులో కేసు వేసినట్లు వార్తలు వచ్చాయి.
తనకు వాటా రావాలంటూ... న్యాయవాది ద్వారా అక్క భూమా అఖిల ప్రియ మీద, స్థలం కొనుగోలుదారుపై విఖ్యాత్ రెడ్డి కేసు వేసినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ వ్యవహారంపై ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న జగత్ విఖ్యాత్ రెడ్డి సామాజిక మాధ్యమం ద్వారా స్పందించారు. తన అక్క భూమా అఖిలప్రియ మీద తాను కేసు వేసినట్లు వస్తున్న వార్తలను ఖండించారు. తాను దుబాయిలో ఉన్నానని... ఈ సమయంలో ఇలాంటి వార్తలు రావడం బాధాకరమన్నారు. తమ కుటుంబంపై వస్తున్న వార్తలన్నీ అసత్యాలని తేల్చిచెప్పారు. తామంతా ఒకటిగానే ఉన్నామన్నారు.
ఇవీ చదవండి