రాష్ట్రంలో తెదేపా కార్యకర్తలపై వైకాపా దాడులు పెరిగిపోతున్నాయని మాజీ మంత్రి యనమల ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా గారలో రహదారిని ధ్వంసం చేశారని తెలిపారు. పలుచోట్ల అన్న క్యాంటీన్ల శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా సీఎస్‌పురంలో రూ.10 లక్షలతో నిర్మించిన రోడ్డు తవ్వేశారని గుర్తుచేశారు. అనంతపురం జిల్లా బత్తలపల్లిలో అంగన్వాడీ భవనం కూల్చారన్న యనమల... తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నెలరోజుల్లో 130కి పైగా దాడులు, దౌర్జన్యాలకు పాల్పడ్డారన్న మాజీమంత్రి... భౌతికదాడులు చేస్తూ... ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంత జరుగుతున్నా సీఎం జగన్ స్పందించకపోవడం సరికాదని హితవు పలికారు. అనుచరులను నియంత్రించకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. శాంతిభద్రతలు దిగజారితే రాష్ట్రానికి చెడ్డపేరు వస్తుందన్న యనమల... పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రారన్నారు. దాడులు ఆగకుంటే వచ్చిన పెట్టుబడులూ వెనక్కి పోతాయని హెచ్చరించారు.
ఇదీ చదవండీ...