లక్షల్లో ఉండే ఈ కీటకజాతులు పుడమికి అందం. జీవ వైవిధ్యానికి తార్కాణం. సమస్త జీవరాశికి ప్రాణావసరం. ప్రకృతిలో సహజసిద్ధమైన ఆహారగొలుసులో కీలకభాగమయిన వీటి ఉసురును మానవులు తీస్తున్నారు. మన చర్యలతో 4లక్షల కీటక జాతులు తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి వచ్చిందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దీన్ని అడ్డుకోకుంటే పెను నష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
పుడమిపైనున్న జీవకోటిలో ఏ ప్రాణీ సర్వస్వతంత్రం కాదు. మనుగడ కోసం మొక్కలపైనో ఇతర జీవులపైనో ఆధారపడాల్సిందే. సున్నితమైన ఈ గొలుసుకట్టులో చిన్నా.. పెద్దా.. తేడా లేకుండా ప్రతి ప్రాణికీ పాత్ర ఉంది. మానవుడి స్వార్థం ఈ శృంఖలానికి బీటలు వారుస్తోంది. ఆహార గొలుసులో అత్యంత కీలకమైన కీటకాలు రాలిపోతున్నాయి. వాటిని తిని బతికే అనేక పక్షులు, జీవజాతులు ఆకలికి అలమటించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అంతిమంగా మానవులకూ పెను ముప్పే. మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కొంటున్నాం.
- మానవుల కన్నా కీటకాల సంఖ్య 17 రెట్లు అధికం. మొత్తం జంతుజాతుల్లో కీటకాల వాటా 70%. మానవులు ప్రకృతిని ధ్వంసం చేయడం, మితిమీరి క్రిమిసంహారక మందులను వాడటం వల్ల 1970 నుంచి సగం మేర కీటకాలు చనిపోయాయి.
- ప్రస్తుతం మనకు తెలిసిన 10 లక్షల కీటక జాతుల్లో 40 శాతం అంతర్థాన ముప్పును ఎదుర్కొంటున్నాయి. వీటికితోడు మరో మూడో వంతు మేర జీవులు ఆ దశకు చేరువవుతున్నాయి.
- గత శతాబ్దంలో 23 రకాల తేనెటీగ, కందిరీగ జాతులు అంతరించిపోయాయి. ఇదే సమయంలో గత పాతికేళ్లలో క్రిమిసంహారక మందుల వాడకం దాదాపుగా రెట్టింపయింది.
- ఒక నిర్దిష్ట ఆవాస ప్రదేశంలోనే ఉండే బ్రిటన్ సీతాకోక చిలుకలు.. 1970ల మధ్య నుంచి 77 శాతం మేర తగ్గిపోయాయి. ఎక్కడైనా ఉండగలిగే సీతాకోకచిలుకలు 40 శాతం తగ్గిపోయాయి.
- కీటకాలు తగ్గిపోవడం వల్ల ఇతర జాతులపైనా ఆ ప్రభావం పడుతోంది. ఎగిరే కీటకాలను తినే ‘స్పాటెడ్ ఫ్లై క్యాచర్’ పక్షి జాతి 1967 నుంచి 93 శాతం పడిపోయింది.
- జర్మనీలోని ప్రకృతి రిజర్వులలో గత 27 ఏళ్లలో 75 శాతం మేర కీటకాల సంఖ్య తగ్గిపోయింది.
ఈ బుల్లి జీవులు ఎందుకు అవసరం?
* ఈ కీటకాలు జీవానికి సంబంధించి ప్రాథమిక ఇటుకల్లాంటివి. చిన్నగానే ఉన్నప్పటికీ వాటితో బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. అన్నిరకాల పర్యావరణ వ్యవస్థలకు వీటి అవసరం ఉంది.
* ప్రపంచవ్యాప్తంగా మూడొంతుల మేర పంటల్లో పరాగ సంపర్కానికి కీటకాలే ఆధారం. ఇవి లేకుంటే ఆహార భద్రత ప్రమాదంలో పడుతుంది.
ఎందుకీ దుస్థితి
*ఆవాసాలు తగ్గిపోవడం
*వ్యవసాయం, పట్టణీకరణ
*క్రిమిసంహారకాలు, ఎరువులు
*వాతావరణ మార్పులు
మనమేం చేయాలి..
ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. కీటకాల హననాన్ని మనం ఆపితే అవి చాలా వేగంగా కోలుకుంటాయి. అందుకోసం తోటలు, పార్కులు, వ్యవసాయ క్షేత్రాలు, పని ప్రదేశాల్లో తక్షణ చర్యలు చేపట్టాలి.
చీకటి నింపుతున్న కాంతి
రాత్రివేళ మనం వాడే విద్యుత్ దీపాల వల్ల కూడా కీటకాల సంఖ్య బాగా తగ్గిపోతోంది. మానవ చర్యల వల్ల తలెత్తే వాతావరణ మార్పుల వంటివాటిని తట్టుకోవడం కొంత మేర సాధ్యమైనా.. కాంతి కాలుష్యాన్ని తట్టుకోవడం మాత్రం వాటికి సాధ్యం కావడంలేదు.
* కీటక జాతుల్లో సగం నిశాచర ప్రాణులే.చంద్రుడి వెలుగుగా భ్రమపడుతూ అనేక కీటకాలు బల్బుల చుట్టూ చేరి రెక్కలు ఆడిస్తూ గడిపేస్తాయి. అలసిపోవడం వల్ల కానీ వేరే జీవులకు ఆహారంగా మారడం వల్ల కానీ వాటిలో మూడో వంతు కీటకాలు ఉదయంలోగా చనిపోతాయి.
* ఫైర్‌ఫ్లై బీటిల్స్‌లు సంయోగం కోసం బయోలూమినిసెంట్ సంకేతాలను ఇచ్చిపుచ్చుకుంటాయి. కాంతి కాలుష్యంతో వీటికి అవరోధం ఏర్పడుతోంది.
* 60% పక్షులకు కీటకాలే ఆధారం. ఇవి తగ్గిపోతే ఈ పక్షులూ తగ్గిపోతాయి.
* కీటకాల సంఖ్య ఏటా 2.5% మేర తగ్గుతోంది. శతాబ్దంలోపే భారీగా అంతర్థానాలు తప్పవు.
* అనవసర దీపాలను ఆపేయడం, వెలుగు అవసరం లేని చోట్ల నీడను కల్పించడం వంటి చర్యలతో సులువుగా ఈ కీటకాలకు నష్టాన్ని తగ్గించొచ్చు.