పల్లెల నుంచి వచ్చి పట్టణాల్లో స్థిరపడిన వారు ప్రతీ వేసవిలో... ముంజలను తలుచుకోకుండా ఉండరు. అలాంటివారికి.. తాటిముంజలు ఆశించినంత దొరక్క.. అసంతృప్తి ఎదురవుతూ ఉంటుంది. మహానగరం హైదరాబాద్‌లోనూ ఈ పరిస్థితి కనిపిస్తుంటుంది. కానీ.. మన కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి.. అక్కడికి తాటిముంజలు బాగా సరఫరా అవుతున్నాయి. ఈ కారణంగా.. దివిసీమ ప్రాంతానికి చెందిన చాలా మందికి ఉపాధి లభిస్తోంది.
కృష్ణా జిల్లా... దివిసీమలోని అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ద్వారా ప్రతీరోజు హైదరాబాద్‌కు వందలాది బస్తాల్లో ముంజకాయలు తరలిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. మహానగరంలో ప్రజల నుంచి స్పందన బాగానే ఉందంటున్న దివిసీమ వాసులు... హైదరాబాద్‌లోని కొందరు ట్రాఫిక్ పోలీసులు తమను ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన చెందుతున్నారు.
హైదరాబాద్‌లోనే కాకుండా కృష్ణాజిల్లా చల్లపల్లి, ఘంటశాల, మోపిదేవి మండలాల్లో 216 జాతీయ రహదారిపై, విజయవాడ - అవనిగడ్డ రహదారి, కృష్ణా కరకట్టపై రోడ్డు పక్కనా అమ్ముతూ కొందరు ఉపాధి పొందుతున్నారు. రోడ్డుపై ప్రయాణించే వారు... ఈ తాటి ముంజలు చూసి కొనుగోలు చేస్తున్నారు. గ్రామాల్లోనూ తాటిచెట్లు ఎక్కే వారు లేక ఇలా రోడ్డు పక్కన అమ్మేవాటినే కొనుక్కొని తింటున్నారు. ఇవి కొనుక్కని తిన్న చాలామంది పెద్దలు తమ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారని అమ్మకందారులు చెబుతున్నారు.