అయిదు కోట్ల మంది ఆంధ్రులు ముక్తకంఠంతో ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్నారని శ్రీకాకుళం తెదేపా ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. 2019 బడ్జెట్ అనుబంధ పద్దులపై బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘‘ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో చెప్పిన హామీలు చాలా పెండింగ్‌లో ఉన్నాయి. అందులో ప్రధానమైనది ప్రత్యేకహోదా. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్ర విభజన సమయంలో తాము అధికారంలోకి వస్తే హోదా ఇస్తామని హామీ ఇచ్చింది. సాధ్యమైనంత త్వరగా ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని కోరుతున్నాం. చట్టంలో చెప్పిన విద్యాసంస్థలను పూర్తిచేసేందుకు తగిన మార్గసూచి, ప్రణాళికను కేంద్రం ప్రకటించాలి. విశాఖ రైల్వేజోన్‌కు తగిన కేటాయింపులు జరిపి ప్రాథమికంగా అవసరమైన మౌలికవసతులన్నీ కల్పించాలి. పోలవరం ప్రాజెక్టును గడువులోగా పూర్తిచేయడానికి నిరంతరం నిధులు విడుదల చేయాలి. విభజన చట్టంలో చెప్పిన విధంగా రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం నిధులివ్వాలి. వెనుకబడిన ఏడు జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలి. అమరావతిని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు అనుసంధానం చేసే హైవే ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి. శ్రీకాకుళంజిల్లా గుండా వెళ్లే ఎన్‌హెచ్16కీ తగిన నిధులు ఇవ్వాలి. కాకినాడ పెట్రో కెమికల్ ప్రాజెక్టుతోపాటు మరికొన్ని పెండింగ్‌లో ఉన్నాయి. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ప్రతి హామీని నిలబెట్టుకోవాలి. ఆర్థికమంత్రి దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలి’’ అని రామ్మోహన్‌నాయుడు డిమాండ్ చేశారు.
రాష్ట్రం అప్పులమీద బతుకుతోంది: మిథున్‌రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం అప్పులమీద బతుకుతోందని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవడానికి ప్రత్యేహోదా ఒక్కటే పరిష్కారమార్గమని వైకాపా లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన బుధవారం లోక్‌సభలో బడ్జెట్ అనుబంధపద్దులపై జరిగిన చర్చలో పాల్గొని మాట్లాడారు. ‘‘ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. రాష్ట్రానికి అత్యవసరమైన హోదాను ప్రకటించాలి. విభజన చట్టంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి. గత అయిదేళ్లలో రాష్ట్ర అప్పు రూ.2.58 లక్షల కోట్లకు చేరింది. వడ్డీ, అసలు చెల్లింపులకే రూ.40వేల కోట్లు పోతోంది. ఈ నేపథ్యంలో రెవెన్యూ లోటు సహా అన్నిరకాల పెండింగ్ నిధులను వెంటనే రాష్ట్రానికి విడుదల చేయాలి. కృష్ణా-గోదావరి నదుల అనుసంధానాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం చేపట్టాలి. రామాయపట్నం వద్ద మేజర్ పోర్టు ఏర్పాటు చేయాలి. కడప స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం తనవంతు సాయం అందించాలి. ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరణ కార్యక్రమానికి కేంద్రం చేయూతనందించాలి’’ అని మిథున్‌రెడ్డి కోరారు.
ఇవీ చదవండి