రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక వైద్య విద్యా సంస్థ ఎయిమ్స్‌లో వచ్చే ఏడాది నుంచి మరో 50 సీట్లు పెరగనున్నాయి. త్వరలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ మేరకు అధికారిక ప్రకటన జారీ చేయనుంది. సీట్లకు తగినట్లు అదనపు సిబ్బందిని సైతం తీసుకోనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
త్వరలో అదనపు సీట్లపై కేంద్రం అధికారిక ప్రకటన
మంగళగిరి ఎయిమ్స్‌లో 2020 - 21 విద్యా సంవత్సరం నుంచి 50 సీట్లు పెరగబోతున్నాయి .ప్రస్తుతమున్న 50 సీట్లలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 20 మంది విద్యార్థులు ఉన్నారు. తాజాగా అదనంగా మరో 50 సీట్లతోపాటు ఈడబ్లూఎస్ కోటా కింద 12 వరకూ సీట్లు సమకూరే అవకాశం ఉంది. మంగళగిరి ఎయిమ్స్‌లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయి విద్యార్థులు సైతం ఆసక్తి చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో అదనపు సీట్లపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ త్వరలోనే అధికారిక ప్రకటన జారీ చేయనుంది.
శరవేగంగా ఆచార్యుల నియామకాలు
2018 - 19లో 50 సీట్లతో ప్రారంభమైన ఎయిమ్స్ తరగతులు... ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో కొనసాగుతున్నాయి. విద్యార్థుల అవసరాలకు తగినట్లుగా ఆచార్యుల నియామకాలు శరవేగంగా సాగుతున్నాయి. తొలి ఏడాదిలో 32 మందిని నియమించగా... 2019 - 20 విద్యా సంవత్సరంలో మరో 70 మందిని తీసుకున్నారు. ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు కలిగిన యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్, న్యూయార్క్‌లోని మౌంట్ సినాయ్ సంస్థలతో బోధన, పరిశోధన కోసం ఒప్పందాలు జరగనున్నాయని ఎయిమ్స్ అధ్యక్షులు డాక్టర్ రవికుమార్ తెలిపారు .
అత్యాధునికమైన వైద్య పరికరాలు అందుబాటులో..
ప్రస్తుతం ఎయిమ్స్‌లో ఉన్నత ప్రమాణాలతో వైద్య బోధన సాగుతోంది. తొలి విద్యా సంవత్సరం నుంచే ప్రతి 10మంది వైద్య విద్యార్థులకు ఒక మృతదేహం చొప్పున బోధనకు కేటాయించారు. అత్యాధునికమైన, ఖరీదైన వైద్య పరికరాలు సైతం అందుబాటులో ఉంచారు. ర్యాగింగ్ లాంటి పోకడలకు అవకాశం లేకుండా డీన్ నుంచి ఆచార్యుల వరకు వసతి గృహంలో ప్రతిరోజూ ఒకరు అందుబాటులో ఉంటున్నారు. ప్రతి ఇద్దరు విద్యార్థులకు ఒక మెంటార్ సైతం ఏర్పాటు చేశారు.
ఇవీ చదవండి