విజయవాడలో ప్రతిష్ఠాత్మక స్థాయిలో 150 కోట్ల వ్యయంతో సిద్ధమవుతున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కోసం ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఐదంతస్తుల భవనం నిర్మాణం పనులు చివరి దశకు చేరుకోగా భారీ నామఫలకం సైతం ఏర్పాటు చేశారు. చక్కని భవనం, పచ్చదనంతో కూడిన విశాలమైన ఆవరణ ఆకట్టుకుంటోంది. ఒక్కో అంతస్తులో ఆపరేషన్ థియేటర్లు, వైద్యుల గదులు, ఓపీ, రోగులకు పడక గదులు ఏర్పాటు చేస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి తేనున్నందున అధునాతన వైద్య పరికరాలు కొనుగోలు చేయాల్సి ఉంది. వైద్యుల నియామకం దిశగా ప్రభుత్వం పోస్టులు మంజూరు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు నిజానికి పెద్దగా సమయం అవసరం లేకున్నా ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలీని పరిస్థితి నెలకొంది. 2, 3 నెలల్లోనే అందుబాటులోకి తీసుకొస్తామని ప్రతిసారీ అధికారులు ప్రకటించటం, ఆ తర్వాత వాయిదా పడడం మామూలైపోయింది.
రాష్ట్ర విభజన తర్వాత విజయవాడలోనూ సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం స్థానిక కొత్త ఆస్పత్రి ప్రాంగణంలోనే జూన్ 12, 2016లో ఈ నిర్మాణం ప్రారంభించింది. అయితే ఏడాదిలోనే పూర్తి చేయాలని తలపెట్టిన ఆస్పత్రి ఇంత కాలం గడిచినా ప్రజలకు అందుబాటులోకి రానేలేదు. అధునాతనమైన ఆయా సేవలు అందుబాటులోకి వస్తే పేద, మధ్యతరగతి ప్రజలకు ఎనలేని ప్రయోజనాలు చేకూరనున్నాయి. న్యూరాలజీ, నెఫ్రాలజీ, కార్డియో థొరాసిస్, కార్డియాలజీ, పసిపిల్లలకు పిడియాట్రిక్ సర్జరీ లాంటి అత్యవసర వైద్య సేవలు ఉచితంగానే అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం ఆయా సేవల కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. లేకుంటే ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షలు వెచ్చించాల్సి వస్తోంది.
కనీసం కొత్త ఏడాది ఆరంభంలోనైనా సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోనికి తీసుకు రావాలని ప్రజలు కోరుతున్నారు.