తన ఇంటి పాల అవసరాలకైనా పనికొస్తాయనే ఉద్దేశ్యంతో గోవుల పెంపకాన్నే చేపట్టారు రామకృష్ణ. రసాయన ఎరువులు, పురుగు మందులకు చెల్లుచీటి పాడారు. తన వద్ద ఎనిమిది ఆవులు, ఒక దూడ ఉన్నాయి. వీటి నుంచి వచ్చే పేడ, మూత్రంతోనే పొలానికి అవసరమైన ఎరువులు సిద్ధం చేసుకున్నారు. జీవామృతం, వేప పిండి, మజ్జిగ, పలు రకాల కషాయాలు వాడటం మొదలుపెట్టారు. ఎలాంటి ఇతర రసాయనాలు వినియోగించకుండా సేంద్రీయ పద్ధతిలోనే సాగు చేపట్టారు. దేశవాళీ విత్తనాలను ఎంచుకున్నారు. ఒకే విత్తనాన్ని మొత్తం పది ఎకరాలు వేయకుండా వివిధ రకాలను వినియోగించారు. విభిన్న రకాలైన నారాయణకామిని, ఘని, చింతలూరు సన్నాలు, కాలాబట్టి (నల్ల వరి) వంటి దేశీయ వరి వంగడాలు ఎంచుకున్నారు. ఇష్టంగా కష్టపడ్డారు. తొలి ఏడాది 16, తర్వాతి సంవత్సరం 20, ఈసారి ఏకంగా 24 బస్తాల దిగుబడులు సాధించారు. రామకృష్ణ ప్రకృతి సేద్యానికి వ్యవసాయశాఖ సిబ్బంది తగిన ప్రోత్సాహం అందిస్తున్నారు.
ప్రకృతి సేద్యంతో పండే పంటలకు మంచి ధర రాదనేది అపోహ మాత్రమేనని రామకృష్ణ చెబుతున్నారు. తన పంట దిగుబడులను కొనుగోలు చేయడానికి దుకాణదారులు మూడు నెలల ముందు నుంచే వెంటబడుతున్నారన్నారు. ముందస్తుగా చెల్లింపులు చేసి మరీ కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. అన్నింటి కన్నా ముఖ్యంగా.. ఈ ప్రకృతికి, తోటి మనుషులకు సేంద్రీయ సాగు ద్వారా తన వంతు సేవ అందిస్తున్నానన్న ఆత్మసంతృప్తిని చెందుతున్నానని త్వరలోనే ఈ తరహాలోనే కూరగాయల సాగు చేపట్టాలన్నది తన లక్ష్యమని రామకృష్ణ పేర్కొంటున్నారు.
ఔషధ, పోషక విలువలున్న వరి రకాలు పెంచితే మార్కెట్‌లో మంచి ఆదరణ లభిస్తుందన్నది రామకృష్ణ నమ్మకం. ఎంత వ్యాపార ఒత్తిడి ఉన్నా రోజుకు నాలుగు నుంచి ఐదు గంటల పాటు వ్యవసాయ క్షేత్రంలో కష్టపడుతుంటారు. ఎప్పటికప్పుడు వ్యవసాయాధికారులను సంప్రదిస్తూ వారి సలహాలతో సాగుకు మరిన్ని మెరుగులు దిద్దుతున్నారు.
ఇవీ చదవండి...విశాఖ టు విజయవాడ... వయా యువత..!