ఇంద్రకీలాద్రిపై భవానీల దీక్ష విరమణ రెండో రోజుకు చేరుకున్నాయి. దసరా ఉత్సవాల్లో భాగంగా చివరిరోజైన విజయ దశమి నుంచి ఇంద్రకీలాద్రికి భవానీల తాకిడి ఎక్కువైంది. దీక్షలు విరమించేందుకు పెద్ద సంఖ్యలో భవానీలు తరలివస్తున్నారు. కాలినడకన, రైల్వే స్టేషన్, బస్టాండ్ నుంచి వచ్చే భవానీలు ముందుగా శనేశ్వరాలయం వద్దకు చేరుకుంటున్నారు. ఈ ఆలయం వెనుకవైపున ఉన్న కృష్ణవేణి ఘాట్‌లో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని...ఈ ఘాట్‌కు ఎదురుగా కేశఖండన శాలల సంఖ్యను పెంచారు.
స్నానాలు ఆచరించిన భవానీలు...అక్కడి నుంచి వినాయకుడి ఆలయం, కంట్రోల్ రూం వద్ద నుంచి క్యూలైన్లలోకి ప్రవేశిస్తారు. దసరా ఉత్సవాల సందర్భంగా 300, 100, ఉచిత దర్శనం లైన్లు ఏర్పాటు చేసినా.....భవానీలను అన్ని లైన్లలో ఉచితంగానే దర్శనానికి అనుమతిస్తున్నారు. అనంతరం మల్లేశ్వరస్వామి ఆలయం నుంచి కిందికి దిగిన భవానీలు మహామంటపం ఎదురుగా ఏర్పాటు చేసిన కేంద్రంలో ఇరుముళ్లు సమర్పిస్తున్నారు. కనకదుర్గా నగర్ ప్రారంభంలో ఏర్పాటు చేసిన ప్రసాదాల కౌంటర్ల వద్ద....భక్తులు బారులు తీరుతున్నారు.
అధికారులు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసినా.. భక్తులు మాత్రం కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కంట్రోల్ రూం నుంచి వృద్ధులు, ప్రత్యేక అవసరాల వారి కోసం ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేసినా... ఇవి ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయన్న సమాచారాన్ని సరిగా తెలిపే ఏర్పాటు చేయకపోవడం భక్తులకు ఇబ్బంది కలిగిస్తోంది.
దసరా ఉత్సవాలు ముగిసినా.. ఇంద్రకీలాద్రిపై భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంది. మరో రెండు రోజుల పాటు భవానీలు దీక్షలు విరమించేందుకు దుర్గమ్మ సన్నిధికి భారీగా వచ్చే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: భక్తులతో ఇంద్రకీలాద్రి కిటకిట... దుర్గమ్మ సేవలో ప్రముఖులు