'అమరావతి ముద్దు - మూడు రాజధానులు వద్దు' అనే నినాదంతో జగ్గయ్యపేటలో అమరావతి పరిరక్షణ సమితి కార్యాచరణ ప్రారంభించింది. సమితి కోర్దినేటర్ ధూళిపాళ లక్ష్మణరావు ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో మాజీ మంత్రి నెట్టెం రఘురామ్, తెదేపా, కాంగ్రెస్, సీపీఐ, జనసేన పార్టీలు ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ సర్కిల్లో భోగి మంటలు వేసి బోస్టన్ కమిటీ, జీఎన్‌రావు కమిటీల నివేదికలను దగ్ధం చేశారు. రాజధాని కోసం త్యాగం చేసినవారికి అండగా నిలుస్తామని అన్నారు. సీఎం జగన్ ఈ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయడానికి తనకు అనుకూలమైన కమిటీలు వేస్తున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు.
రాజధాని ప్రాంత రైతులు, మహిళల ఆందోళనలకు మద్దతుగా కృష్ణానదీ తీరంలో మానవహారం చేపట్టేందుకు ప్రయత్నించిన అమరావతి వాకర్స్ అండ్ రన్నర్స్ సంఘం సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. మానవహారం చేపడుతున్న సమాచారంతో తాడేపల్లి సమీపంలోని కృష్ణానదీ తీర ప్రాంతానికి పోలీసులు ఆవారా సభ్యులను అడ్డుకున్నారు. పోలీసులు, ఆవారా సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది.
అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉంటుందనే నాడు వైకాపా సహా అన్ని రాజకీయ పార్టీలు అమరావతిని రాజధానిగా అంగీకరించాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. దానికి భిన్నంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం సరికాదని సూచించారు.