రాష్ట్రంలో అవినీతి కేసుల్లో దొరికిపోతున్న వారిలో రెవెన్యూ ఉద్యోగులే అధికంగా ఉంటున్నారు. వివిధ పనుల కోసం ప్రజల నుంచి లంచం తీసుకుంటూ గతేడాది మొత్తం 96 మంది ప్రభుత్వోద్యోగులు అవినీతి నిరోధక శాఖకు చిక్కగా... వారిలో 36 మంది రెవెన్యూ ఉద్యోగులే ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. ప్రధానంగా పట్టాదారు పాసుపుస్తకాల మంజూరు, భూ దస్త్రాల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు, భూ హక్కుల కల్పనకు సంబంధించిన ధ్రువపత్రాలు, అనుమతుల మంజూరు వంటి సేవల కోసం లంచాలు తీసుకుంటూ ఎక్కువ మంది రెవెన్యూ ఉద్యోగులు అనిశా వలలో చిక్కారు.
రెండో స్థానంలో పోలీసు శాఖ
ఈ ఏడాది 11 మంది పోలీసులు అనిశాకు చిక్కి.. ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. స్టేషన్ బెయిళ్ల మంజూరు, కేసు నమోదు చేసేటప్పుడు పెట్టే సెక్షన్లలో, దర్యాప్తు పూర్తైన తర్వాత అభియోగపత్రాల్లో అవసరమైన మార్పులు చేర్పులు చేయడం వంటి పనుల కోసం లంచాలు తీసుకుంటూ పలువురు స్టేషన్ హౌస్ అధికారులు, హెడ్ కానిస్టేబుళ్లు దొరికారు. పోలీసుల తర్వాత స్థానంలో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ఉద్యోగులు ఉన్నారు. భవనాల నిర్మాణానికి మంజూరులో భాగంగా చేపట్టే తదుపరి పరిశీలన సమయంలోనూ, ఆస్తి పన్నుల మదింపు, ట్రేడ్ లైసెన్సుల జారీ వంటి అంశాల్లో లంచాలు తీసుకుంటూ కొందరు పట్టుపడ్డారు.
ఆ ఐదు శాఖల ఉద్యోగులే 72 శాతం
2019లో నమోదైన కేసులకు సంబంధించి అనిశా విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ వివరాలు బహిర్గతమయ్యాయి. దీని ప్రకారం.. అవినీతి కేసుల్లో చిక్కుతున్నవారిలో.... రెవెన్యూ, హోం, పురపాలక, పట్టణాభివృద్ధి, ఇంధన, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల ఉద్యోగులే సుమారు 72 శాతం మంది ఉన్నారు. అన్ని శాఖల్లో కలిపి మొత్తం 96 మంది పట్టుబడితే 69 మంది ఈ ఐదు శాఖల ఉద్యోగులే ఉన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఉచ్చుకేసులు అక్రమాస్తుల కేసులు తగ్గిపోగా.. శిక్షలు కొంతమేర పెరిగాయి.
ఇవీ చదవండి: