ఆరు నెలల్లో వైకాపా పాలన చూసి ఓర్వలేకే చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని... తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయినా చంద్రబాబు... ఇంకా తన తీరు మార్చుకోలేదని ధ్వజమెత్తారు. రాజధాని ప్రజలను మోసం చేశారు కాబట్టే... చంద్రబాబు కాన్వాయ్‌పై దాడి చేశారని పేర్కొన్నారు. అమరావతిలో మాట్లాడిన ఆమె... తెదేపాపై తీవ్ర విమర్శలు చేశారు.
గత తెదేపా ప్రభుత్వం రైతులను భయపెట్టి బలవంతంగా భూములు సేకరించిందని, అందువల్ల రైతులు రోడ్డున పడ్డారని శ్రీదేవి ఆరోపించారు. చంద్రబాబు పర్యటనలో ఆందోళన చేసిన వారిని... తెదేపా నేతలు టెర్రరిస్టులుగా చిత్రీకరించడం దారుణమన్నారు. రాజధానిలో గ్రాఫిక్స్ చూపించి చంద్రబాబు మోసం చేశారని, చివరకు అక్కడ జిల్లేడు చెట్లు, బీడు భూములే దర్శనమిస్తున్నాయని చెప్పారు.
రౌండ్ టేబుల్ సమావేశం విజయవాడలో ఎందుకు..?
చంద్రబాబు ఈనెల 5న విజయవాడలో తలపెట్టిన రౌండ్ టేబుల్ సమావేశాన్ని... అమరావతిలో నిర్వహించాలని శ్రీదేవి సవాల్ విసిరారు. రాజధానిలో 2వేల ఎకరాల అసైన్డ్ భూములను తక్కువ ధరకే తెదేపా నేతలు కొట్టేశారని... అంబేడ్కర్ స్మృతివనం నిర్మిస్తామని హామీలిచ్చి విస్మరించారని దుయ్యబట్టారు. సాష్టాంగ నమస్కారాలు శిలాఫలకానికి కాకుండా... రైతు కూలీలకు చేయాలని హితవుపలికారు.
కిలోమీటర్‌కు రూ.45 కోట్లా..?
రాజధానిలో నిర్మించిన రోడ్లకు దేశంలో ఎక్కడా లేని రీతిలో కిలోమీటర్‌కు రూ.45 కోట్లు ఖర్చు చేసి... అక్రమాలకు పాల్పడ్డారని తాడికొండ ఎమ్మెల్యే ఆరోపించారు. ఈసారి చంద్రబాబు అమరావతి వస్తే... అక్కడి ప్రజలు తీవ్రంగా ప్రతిఘటిస్తారని హెచ్చరించారు.
ఇదీ చదవండి :