ఆంగ్ల మాధ్యమ బోధనకు తెదేపా వ్యతిరేకమని... వైకాపా నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. తెలుగు భాషను కనుమరుగు చేసేలా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరునే తాము తప్పుబడుతున్నామని స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయంలో సీనియర్ నేతలతో ఆయన సమావేశమై... తాజా పరిణామాలపై చర్చించారు. గత 5 ఏళ్ల పాలనలో పాఠశాలల్లో తెలుగుకు ప్రాధాన్యం ఇస్తూనే... ఆంగ్ల భాషా బోధనకు తమ ప్రభుత్వం దశల వారీగా చేసిన కృషిని ప్రస్తావించారు.
2015-16లోనే రాష్ట్రంలో నూతన విద్యావిధానాన్ని అమల్లోకి తెచ్చామని చంద్రబాబు గుర్తుచేశారు. 2018-19నుంచి మోడల్ ప్రైమరీ స్కూళ్లలో, ఇతర ప్రైమరీ పాఠశాలల్లోనూ ఆంగ్ల మాధ్యమాన్ని తెలుగుతో సమాంతరంగా నిర్వహించే విధంగా ఉత్తర్వులు ఇచ్చామన్నారు. ఆంగ్ల భాష బోధనకు పాఠశాలల్లో... అదనపు తరగతి గదుల నిర్మాణం, టీచర్ల నియామకం వంటి చర్యలు చేపట్టామని వివరించారు. వాస్తవాలు ఇలా ఉంటే... పేద విద్యార్థులకు ఆంగ్లమాధ్యమం బోధనకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకంగా ఉందనే దుష్ప్రచారం చేయటం గర్హనీయమని చంద్రబాబు దుయ్యబట్టారు. ఇటీవల నీతి అయోగ్ ర్యాంకుల్లో ఏపీ ప్రథమ స్థానం సాధించడం తమ కృషికి నిదర్శనమన్నారు.
వారిది రెండు నాలుకల ధోరణి...
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా... అధికారంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడటం జగన్‌కే చెల్లిందని చంద్రబాబు దుయ్యబట్టారు. మున్సిపల్ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమాన్ని తెదేపా ప్రవేశపెట్టినప్పుడు... అసెంబ్లీలో జగన్ వ్యాఖ్యలు, సాక్షి మీడియాలో కథనాలు వచ్చిన విషయం గుర్తుచేశారు. వైకాపా దివాలాకోరు విధానాలకు నిదర్శనమని ఆక్షేపించారు. అబ్దుల్ కలాం పేరుతో ఉన్న ప్రతిభ అవార్డులను రాజశేఖర రెడ్డి పేరు మీదకు మార్చి... ప్రజల్లో వ్యతిరేకత రావటంతో తోక ముడిచారని ఎద్దేవా చేశారు. వైకాపా నేతల రెండు నాలుకల ధోరణిని ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.