రాష్ట్రంలో పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింలు ఆందోళన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అన్నదమ్ముల్లా కలిసి ఉండే హిందూ, ముస్లింల మధ్య చిచ్చు పెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ముస్లిం సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. రాజ్యాంగ విరుద్దమైన బిల్లును అందరూ వ్యతిరేకించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ కడప జిల్లాలోనూ ముస్లింలు ర్యాలీ చేశారు. బిల్లు కుల మతాల మధ్య చిచ్చు పెట్టేలా ఉందని అన్నారు. ఒంగోలులో ముస్లింలు బిల్లుకు వ్యతిరేకంగా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. లౌకిక వాదాన్ని కాపాడాలని ముస్లిం మత పెద్దలు డిమాండ్ చేశారు.
ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడి
దర్శిలోనూ ముస్లింలు వామపక్షాల నాయకులతో కలిసి నినాదాలు చేశారు. మార్కాపురంలో ముస్లింలు ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. రాజ్యాంగ విరుద్ధమైన బిల్లును వెంటనే ఉపసంహరించు కోవాలని కోరారు. గుంటూరు జిల్లా పొన్నూరులో ప్రజాసంఘాలు, ముస్లింలు సంయుక్తంగా ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఓ యువకుడు చేతిపై బ్లేడుతో గాట్లు పెట్టుకుంటూ నిరసన వ్యక్తం చేశాడు. కర్నూలు జిల్లా నంద్యాలలో బిల్లుకు వ్యతిరేకంగా ముస్లిం సంఘాలు ఆందోళనకు దిగారు. పిడుగురాళ్లలోనూ ముస్లిం నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ బిల్లు భారత దేశ 'భిన్నత్వంతో ఏకత్వం' విధానానికి వ్యతిరేకమనీ, దీని కారణంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశముందని వారు అభిప్రాయపడ్డారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో ముస్లింలు బిల్లును నిరసిస్తూ ర్యాలీ చేశారు.
పౌరసత్వ బిల్లు అంటే..?
పౌరసత్వ చట్టం ప్రకారం పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్థాన్ల నుంచి మతపరమైన ఒత్తిళ్లు ఎదుర్కొని దేశానికి శరణార్థులుగా వచ్చిన వారికి భారత పౌరసత్వం లభించనుంది. 2014 డిసెంబర్ 31కి ముందు దేశంలోకి వచ్చిన వారికి ఈ అవకాశం లభిస్తుంది.
ఇదీ చూడండి: