అరుదైన నాణాలు, స్టాంపులు ప్రదర్శిస్తూ గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి స్టాంప్స్, కాయిన్స్ ఫెస్టివల్ స్థానికులకు ఎనలేని వినోదం, విజ్ఞానం పంచింది. మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలు, న్యూమిస్మాటిక్, ఫిలాటెలిక్ సొసైటీ రజతోత్సవాలు పురస్కరించుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాలానుగుణంగా వచ్చిన మార్పులు, చరిత్ర, సంస్కృతికి ఈ ప్రదర్శన అద్దం పట్టింది.
అలనాటి అర్ధణా, బేడ, పావలా నాణేలు సహా స్వాతంత్రోద్యమ కాలం నాటి కరెన్సీ నోట్లు ప్రదర్శించారు. మొత్తం మీద 110 దేశాల అరుదైన కరెన్సీ అందరినీ అబ్బురపరిచాయి. గాంధీ, మదర్ థెరిస్సా, రామ్ మనోహర్ లోహియా, ఇందిరాగాంధీ వంటి ప్రముఖుల సంతకాలు, వారి ఫోటోతో వచ్చిన స్టాంపులు ఆకట్టుకున్నాయి. అరుదైన ఫ్యాన్సీ నంబర్లు కలిగిన కరెన్సీ నోట్లను పలువురు విక్రయానికి ఉంచారు. తయారీలో లోపాలతో సహా వచ్చిన నోట్లు ప్రదర్శించారు. ఈ సందర్భంగా గుంటూరుకు చెందిన ప్రముఖ వైద్యులు, విద్యావేత్త కాసరనేని సదాశివరావు పేరిట 2 ప్రత్యేక తపాలా బిళ్లలు విడుదల చేశారు.
విజ్ఞానం, వినోదం పంచుతూనే స్టాంపులు, నాణేల సేకరణ ప్రవృత్తిని నేటి తరానికి పరిచయం చేయాలన్నదే తమ ఉద్దేశమని నిర్వహకులు తెలిపారు. తల్లిదండ్రులతో సహా వచ్చిన విద్యార్థులు స్టాంపులు, నాణేల ప్రదర్శనను ఆస్వాదించారు. నచ్చిన వాటిని కొనుగోలు చేశారు.
ఇవి కూడా చదవండి: