కార్పొరేట్, ఎయిడెడ్, ఆన్ ఎయిడెడ్ పాఠశాలల్లో వార్షికోత్సవాల కోసం విద్యార్థుల నుంచి నగదు వసూలును నిలువరించాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది. కృష్ణా జిల్లాకు చెందిన న్యాయవాది రాజశేఖర్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. సొమ్ము వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకునేలా విద్యాశాఖాధికారులను ఆదేశించాలని పిటిషన్లో పేర్కొన్నారు. పాఠశాల వార్షికోత్సవం నిర్వహణ కోసం తల్లిదండ్రుల నుంచి డబ్బులు తీసుకురావాలని విద్యార్థులను ఒత్తిడి చేస్తున్నారన్నారు.
ఇతర రుసుములు చెల్లించటానికి వీల్లేదు
ఏపీ విద్యా సంస్థల నిబంధన 10(11) ప్రకారం ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు తప్ప ఇతర రుసుములు వసూలు చేయడానికి వీల్లేదని ఆయన చెప్పారు. ఈ విషయంపై రాష్ట్రంలోని జిల్లా విద్యాశాఖ అధికారులకు జనవరి 22న వినతి సమర్పించానని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పాఠశాల విద్యా శాఖ పత్యేక కార్యదర్శి, సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాష్ట్రం లోని జిల్లా విద్యాశాఖాధికారులు, హైదరాబాద్, గుంటూరు, విజయవాడలోని శ్రీ చైతన్య స్కూల్, విజయవాడలోని నారాయణ ఒలంపియాడ్ స్కూల్, సుళ్లూరుపేటలోని నారాయణ ఈ టెక్నో స్కూల్ , విజయవాడ, నెల్లూరు రవీంద్ర భారతి స్కూలు, గుంటూరు, విశాఖపట్నంలోని భాష్యం స్కూల్స్, విజయవాడలోని డాక్టర్ కేకేఆర్ గౌతం ఇంటర్నేషనల్ స్కూల్‌ను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.