గుంటూరులోని వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ రాష్ట్ర కార్యాలయంలో కిడ్నీ వ్యాధిగ్రస్థులతో ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి ప్రత్యేక అధికారి డాక్టర్ హరికృష్ణ, ఆరోగ్యశ్రీ సీఈవో మల్లికార్జున వారి సమస్యలు తెలుసుకున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి జగన్ గుంటూరు జీజీహెచ్లో పర్యటించిన సందర్భంగా... కిడ్నీమార్పిడి చేయించుకున్న వారు ప్లకార్డులు చేతబట్టి తమ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు మాత్రం వారిని అక్కడ నుంచి తరలించారు. ఈ ఘటనపై ఈటీవీ, ఈటీవీ భారత్ ప్రచురించిన, ప్రసారం చేసిన కథనాలకు సీఎం స్పందించారు. వారి సమస్య ఏంటో తెలుసుకోవాలని సీఎంవో డా.హరికృష్ణను ప్రత్యేకంగా పంపించారు. ప్రస్తుతం కిడ్నీమార్పిడిని ఆరోగ్యశ్రీలోకి మార్చారని... గతంలో తాము లక్షలాది రూపాయలు అప్పు చేసి కిడ్నీ మార్పిడి చేయించుకున్నామని కిడ్నీ వ్యాధిగ్రస్థులు చెప్పారు. తాము జీవితాంతం మందులు వాడాలని.. వీటిని ఉచితంగా అందించాలని, కిడ్నీమార్పిడి చేయించుకున్న తమకు సైతం ఆరోగ్య ఆసరా కల్పించాలని అధికారులను వేడుకున్నారు. వారి సమస్యలు విన్న అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: