"క్షేత్రస్థాయిలో మద్యనిషేధ కమిటీలు" సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం దశలవారీగా మద్యపాన నిషేధానికి శ్రీకారం చుట్టారని మద్య విమోచన ప్రచార కమిటీ అధ్యక్షుడు వి.లక్ష్మణ రెడ్డి తెలిపారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపా అధికారంలోకి వచ్చిన 4 నెలలోనే మద్యపాన నిషేధానికి అనేక సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. మొదటిగా బెల్ట్ షాప్లు తొలిగించారన్నారు. మద్యానికి బానిసలైన వారికి ప్రత్యేక కౌన్సెలింగ్, వైద్యం అందిచడానికి ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. మద్య విమోచన ప్రచార కమిటీ అధ్యక్షుడుగా తనను నియమించడం సంతోషంగా ఉందన్న ఆయన... గుంటూరు నగరాన్ని కేంద్రంగా చేసుకుని మద్యం నిషేధానికి కార్యకలాపాలు చేస్తామని తెలిపారు. జిల్లా స్థాయి, మండల, గ్రామ స్థాయిలలో కమిటీలు వేసి మద్యపాన నిషేధానికి కృషి చేస్తామన్నారు. బిహార్లో మద్యపాన నిషేధం అమలులో ఉందన్న లక్ష్మణరెడ్డి.. ఆ స్ఫూర్తితో రాష్టంలో కూడా మద్యపాన నిషేధం జరిగేలా తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు.