మార్పు కోసం జగన్‌కు ప్రజలు అవకాశం ఇచ్చారని, కాని జగన్ వచ్చాక పరిస్థితి మరింత దిగజారిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అన్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆయన ధ్వజమెత్తారు.జన్మభూమి కమిటీలతో అవినీతి పెరిగిందని ఆరోపణలు చేసిన వైకాపా... అధికారంలోకి వచ్చాక చేస్తోంది ఏంటని ప్రశ్నించారు. జీతాలు ఇచ్చుకుని తమ కార్యకర్తలనే గ్రామవలంటీర్లుగా నియంమించుకున్నారని ఆరోపించారు. జగన్ గతంలో చెప్పిన మాటలకు చేస్తున్న పనులకు పొంతన లేకుండా పోయిందన్నారు. ఇసుక మాఫియా అరికడతామని చెప్పి, కొత్త పాలసీతో ఇసుకే దొరక్కుండా చేశారని మండిపడ్డారు. రాయలసీమలో తాగునీరు కూడా లేకుండా ప్రజలు నానా యాతనలు పడుతుంటే, బీభత్సంగా వస్తున్న వరద నీటిని సముద్రంలోకి వదిలివేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసేలా వైకాపా ప్రభుత్వ చర్యలున్నాయని విమర్శించారు. అన్ని మతాలకు సమానంగా చూడాల్సిన ప్రభుత్వం, ఒక్క మతానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు. కేంద్రం ఉపాధి హామీ నిధుల బకాయిలను ఇచ్చినా, పాత బకాయిలను ఇంకా చెల్లించలేదని కన్నా మండిపడ్డారు. రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుదేలు చేశారని మండిపడ్డారు. వైకాపా అధికారంలోకి వచ్చాక వ్యక్తులు మారడం తప్ప వ్యవస్థ అలాగే ఉందన్న భావన ప్రజల్లోకి వెళ్ళిందని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.
ఇదీ చూడండి: 'మోదీ 100 రోజుల పాలనలో సరికొత్త అధ్యాయాలు'