రాజధాని గందరగోళంపై సీఎం జగన్ ఎందుకు స్పష్టత ఇవ్వట్లేదని మాజీమంత్రి, తెదేపా నేత కాలవ శ్రీనివాసులు ప్రశ్నించారు. అమరావతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తెదేపా నేతలు... ఏ అంశంపైనా ప్రభుత్వానికి స్పష్టత లేదని అన్నారు. రాజధానిపై మాట్లాడేందుకు జగన్‌కు ఎందుకు మనసు రావట్లేదని..? నిలదీశారు. రాజధానిపై ప్రభుత్వ ప్రకటనలను వైకాపా తప్ప అన్ని పార్టీలూ వ్యతిరేకిస్తున్నాయని దుయ్యబట్టారు. బొత్స రోజుకో అసత్యం జోడించి వివాదానికి మరింత ఆజ్యం పోస్తున్నారని విమర్శించారు.
బాలకృష్ణ వియ్యంకుడిపై అసత్య ఆరోపణలు చేశారని మాజీ మంత్రులు ధ్వజమెత్తారు. ఆ ఆరోపణలకు చంద్రబాబును జవాబు చెప్పమంటున్నారని... కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు భూములిస్తే తెదేపా ఇచ్చిందని అబద్ధం చెప్పడం ఏంటని ప్రశ్నించారు. ఎరువుల పరిశ్రమ నిర్మించే సంస్థపై అసత్యాలు మాట్లాడారని ఆరోపించారు. దీన్ని ఇన్‌సైడర్ ట్రేడింగ్ అని బొత్స అభాండాలు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా నేతల మాటల వెనక రాజకీయ దురుద్దేశం ఉందని ఆరోపించారు.
రాజధానికి ఎంపిక చేసిన ప్రాంతం ముంపునకు గురయ్యేది కాదని మాజీ మంత్రి కాలవ పేర్కొన్నారు. రాజధాని వరదప్రాంతం కాదని ఓ మహిళ సవాలు విసిరిన విషయం గుర్తుచేశారు. రాజధాని ప్రాంతం గతంలో ఎప్పుడూ వరదల్లో మునిగిపోలేదని చెప్పిందని... ముంపుప్రాంతమని నిరూపిస్తే తన 3 ఎకరాలను ఇస్తానన్న వీడియోను చూపించారు. రాజధానిపై సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రాజధానిపై ప్రజలు, రైతులకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
తెదేపాపై కక్షతో బిల్లులు ఇవ్వలేదు: జవహార్
తెదేపాపై కక్షతో నీరు-చెట్టు పనులు చేసిన వారికి ఇంకా బిల్లులు ఇవ్వలేదని మాజీమంత్రి జవహార్ ఆరోపించారు. నీటి నిర్వహణ చేతకాక... రైతుల పొలాలు ముంచారని ధ్వజమెత్తారు. గోదావరి వరదలు వచ్చినప్పుడు ఇజ్రాయెల్... కృష్ణా వరదలు వచ్చినప్పుడు అమెరికా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రైతులపై కపట ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. తెదేపా హయాంలో ఎన్ని విపత్తులు సంభవించినా... సమర్థంగా ఎదుర్కొన్నామని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో చేపట్టిన కార్యక్రమాలను ఇటీవల కేంద్రమంత్రులు ప్రశంసించిన విషయం గుర్తుచేశారు.
రాయలసీమకు నీరు ఎలా తీసుకొస్తారు: కొల్లు రవీంద్ర
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేసిన జగన్... కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఎలా వెళ్లారని మాజీమంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వ్యతిరేకంగా... తెలంగాణ ప్రభుత్వం కేసులు వేసిన విషయం గుర్తుచేశారు. తెలంగాణలో ప్రాజెక్టు నిర్మించి... రాయలసీమకు నీరు ఎలా తీసుకొస్తారని ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగానే... పోలవరంపై జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే... చెప్పిన సమయంలో పోలవరం పనులు పూర్తి చేయాలన్నారు.
ఇదీ చదవండీ...సింధు తెలుగుబిడ్డ కావడం గర్వకారణం: చంద్రబాబు