మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు మరణానికి ప్రభుత్వానిదే బాధ్యత అని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. కోడెలను వెంటాడి వేధించి వేధించి ఇబ్బంది పెట్టారని చంద్రబాబు అన్నారు. కోడెలను ఆర్థికంగా ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. పల్నాడు పులిగా ఉన్న వ్యక్తి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారని చంద్రబాబు ఆక్షేపించారు. ఈ అవమానాలతోనే కోడెల ఆత్మహత్య చేసుకున్నారన్న చంద్రబాబు... వైకాపా నేతలు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. వైకాపా నేతలు ఇష్టానుసారంగా చేయాలనుకుంటే ఎదిరించి పోరాటం చేస్తామన్నారు.
ఫర్నీచర్ తీసుకెళ్తే పెద్ద నేరమా..?
రూపాయి తీసుకోకుండా పేదలకు వైద్యం అందించిన వ్యక్తి కోడెల అని చంద్రబాబు కొనియాడారు. పలు పదవుల్లో ఉండి ప్రజలకు సేవ చేసిన వ్యక్తి కోడెలన్న చంద్రబాబు... కోడెల చేసిన నేరం ఏమిటో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. సభ్యులందరికీ ఫర్నిచర్ ఇస్తారన్న చంద్రబాబు... సభాపతిగా పనిచేసిన కోడెల ఆ ఫర్నిచర్‌ను ఇక్కడికి తీసుకువస్తే పెద్ద నేరంగా రాద్ధాంతం చేశారని ఆరోపించారు. 2019 ఆగస్టు 28న ఈ విషయమై స్పీకర్‌గా కోడెల ఓ లేఖ కూడా రాశారని చంద్రబాబు తెలిపారు.
ఫర్నిచర్ విషయమై వైకాపా ఎమ్మెల్యే చేసిన ఫిర్యాదు అధికారులు అఘమేఘాలపై స్పందించి...సెక్షన్ 409 కింద కోడెలపై కేసు నమోదు చేశారని చంద్రబాబు అన్నారు. జైళ్లో ఉండి వచ్చిన వ్యక్తులు కోడెలపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.
జగన్ సమాధానం చెప్పాలి
కోడెల మృతిపై వైకాపా నేతలు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని చంద్రబాబు చెప్పారు. వైకాపా నేతల వ్యాఖ్యలపై సీఎం జగన్ మౌనం సరికాదన్న తెదేపా అధినేత... ప్రభుత్వం ఇష్టానుసారం చేస్తామంటే చూస్తూ ఊరుకోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.లక్ష విలువైన ఫర్నిచర్‌పైనే ఇన్ని అభియోగాలు మోపడం సరికాదన్న చంద్రబాబు... జగన్ రూ.43 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని సీబీఐ నిర్ధరించిందని, ఆయనను ఏం చేయాలని నిలదీశారు.
పోలీసులదే బాధ్యత
కోడెలపై పెట్టిన ప్రతి అక్రమ కేసుకు పోలీసులు జవాబు చెప్పాలన్న చంద్రబాబు... శాంతిభద్రతల విషయంలో వివక్ష చూపుతున్నారని విమర్శించారు. తన భద్రతపై పోలీసులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. తెదేపా నేతలకు ఎవరికేం జరిగినా పోలీసులదే బాధ్యతని స్పష్టం చేశారు. రాష్ట్రం పట్ల ఓ బాధ్యత ఉంది కాబట్టే ఇన్ని అవమానాలు భరిస్తున్నానని చంద్రబాబు తెలిపారు.
బోటు ప్రమాదం ప్రభుత్వ వైఫల్యమే
బోటు ప్రమాదంలో ఇంకా 21మంది ఆచూకీ తెలియటం లేదన్న చంద్రబాబు... గల్లంతైన మొత్తం 46మంది చనిపోయే పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వ అసమర్థత వల్లే ఈ దారుణం జరిగిందని ఆరోపించారు. మృతుల కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. బోటు ప్రమాదం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమని చంద్రబాబు ఆరోపించారు.
ఇదీ చదవండి :