తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం రావులపాడు జాతీయ రహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. విజయవాడకు చెందిన పంతం సుబ్రహ్మణ్యం, రంబాల భారతి, విజయ, నవ్యత, మనోజ్.. పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామానికి చెందిన బోనం రోహిత్ ఇంటికి సంక్రాంతి పండుగ కోసం వచ్చారు. వీరంతా రావులపాలెంలో సినిమా చూసి తిరిగి వెళ్తుండగా జాతీయ రహదారి సమీపంలో ప్రమాదం జరిగింది.
సిద్ధాంతం నుంచి రావులపాలెం వైపు వేగంగా వచ్చిన వాహనం డివైడర్‌ను ఢీకొని గాలిలో ఎగిరి అవతల రోడ్డులో వెళ్తున్న కారుపై పడింది. కారులో ఉన్న సుబ్రహ్మణ్యం, రోహిత్, భారతి అక్కడికక్కడే చనిపోయారు. విజయ, నవ్యత, మనోజ్‌లను ఆసుపత్రికి తరలిస్తుండగా విజయ మృతి చెందింది. నవ్యత, మనోజ్‌కు గాయాలయ్యాయి. అతివేగంగా వచ్చి ఢీకొట్టిన కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. వారంతా ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు.
ప్రమాదానికి కారణమైన కారులోని వారికీ గాయాలయ్యాయని స్థానికులు చెప్పారు. సంఘటన స్థలాన్ని అమలాపురం డీఎస్పీ బాషా పరిశీలించారు. వివరాలు నమోదు చేసుకున్నారు. ఘటనకు కారణమైన వారిని వెంటనే అరెస్టు చేస్తామని తెలిపారు.
ఇవీ చదవండి: