తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన ఆచంట ఉమేష్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు. ప్రస్తుతం తపాలా శాఖలో విధులు నిర్వర్తిస్తున్నారు. మూడేళ్ల క్రితం ఓ క్రిస్టియన్ మిషనరి పనిమీద రాజమహేంద్రవరం వచ్చారు మెక్సికోకు చెందిన మావి సునేమ్ కస్టరెహాన్ సాలాన్. స్థానిక ఓ చర్చిలో ఉమేష్, సాలాన్తో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం ప్రేమగా మారింది. కొద్ది రోజుల తర్వాత ఆమె మెక్సికో వెళ్లిపోయింది. మావి సునేమ్కు ఆంగ్లం రాదు... ఉమేష్‌కు స్పానిష్ రాదు. అయినా వారి ప్రేమకు సరిహద్దులు అడ్డురాలేదు. ఇద్దరి ప్రేమ సంగతిని కుటుంబ సభ్యులకు చెప్పారు. పెద్దలు తొలుత అంగీకరించలేదు. మూడేళ్లు గడిచినా ఉమేష్, సునేమ్ మాత్రం వెనకడుగువేయలేదు. చివరకు పెద్దలు దిగివచ్చారు. గత నెల 17వ తేదీన మెక్సికోలో ఉమేష్, మావి సునేమ్ కల్యాణం అంగరంగవైభవంగా జరిగింది. ఈ నవ జంట శనివారం మెక్సికో నుంచి రాజమహేంద్రవరం వచ్చారు. కొత్తదంపతులకు బంధువులు సాదరస్వాగతం పలికారు. వివాహం పట్ల ఉమేష్ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో చిగురించిన ప్రేమ ఖండాలు దాటి చివరకు మెక్సికోలో పెళ్లితో శుభం కార్డు పడింది.
ఇదీ చదవండి :
తాడిపత్రి యువకుడు... స్పెయిన్ యువతి... ఇలా పెళ్లి చేసుకున్నారు