శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఈటీవి భారత్తో ప్రత్యేకంగా మాట్లాడారు. దసరా సెలవుల వల్ల భక్తుల రద్దీ పెరిగే అవకాశాలున్నాయని అంచనా వేశారు. 9రోజులు ప్రొటోకాల్ వారికే వీఐపీ బ్రేక్ దర్శనాలుంటాయని చెప్పారు. సిఫారసు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేశారు. చంటిపిల్లలు, వృద్ధులకు ప్రత్యేక ప్రవేశ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు చెప్పారు.
తిరుమల కొండపై 7 వేల 200 వసతి గదులు ఏర్పాటు చేశామన్న ఈవో... వసతి గదుల అడ్వాన్స్ బుకింగ్ నియంత్రిస్తామని వివరించారు. 5 కేంద్రాల ద్వారా నిరంతరం అన్నప్రసాద పంపిణీ చేస్తామన్నారు. గరుడ సేవరోజు 3 లక్షల మందికి సరపడా అన్నప్రసాదం పంపిణీ చేయనున్నట్లు వివరించారు. నిత్యం 7లక్షల లడ్టూలు నిల్వ ఉండేలా ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. పారిశుద్ధ్య నిర్వహణకు అదనంగా 665 మందిని వినియోగిస్తామన్నారు.
15 రాష్ట్రాలకు చెందిన 560 కళాకారులతో ప్రదర్శనలు నిర్వహిస్తామని ఈవో చెప్పారు. 9రోజులపాటు 3100 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేస్తామన్నారు. గరుడసేవకు 1100 మందితో అదనపు భద్రత ఉంటుందని వివరించారు. చక్రస్నానం రోజు విడతలవారీగా పుష్కరిణిలోకి అనుమతిస్తామని చెప్పారు. పుష్కరిణిలో విడతకు గరిష్ఠంగా 10 వేల మందికే పరిమితి విధించినట్లు వివరించారు.
ఇదీ చదవండీ... భవిష్యత్తు చిట్ఫండ్ కంపెనీలదే: శైలజా కిరణ్