తిరుమల అన్నమయ్య భవన్లో తితిదే ధర్మకర్తల మండలి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో చర్చించిన పలు అంశాలు తిరుమల తిరుమతి దేవస్థాన ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు.
సమావేశంలో తీసుకున్న ముఖ్యాంశాలు
* ఆధ్యాత్మిక భావన మరింత పెంచేలా తిరుమల తరహాలో తిరుపతిలోనూ దశలవారీగా మద్యపాన నిషేధం అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి.
* ప్రధాని మోదీ పిలుపు మేరకు తిరుమలలోనూ సంక్రాంతి తర్వాత ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించేందుకు నిర్ణయం. స్వామివారి లడ్డూ ప్రసాదం తీసుకెళ్లేందుకు ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయ చర్యలు
* తిరుపతి నగరవాసులతోపాటు బయట ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా గరుడ వారధిని రీడిజైన్ చేసి రీటెండర్లు పిలిచేందుకు నిర్ణయం. తిరుపతి నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు నగర శివార్ల నుంచే ఈ వారధి ప్రారంభమయ్యేలా డిజైన్‌లో మార్పు చేసేందుకు ఆమోదం.
* నిమ్స్ తరహాలో అభివృద్ధి చేసేలా...తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిని తితిదే ఆధీనంలోకి తీసుకునేందుకు ఆమోదం.
* తితిదే అటవీ విభాగంలో పనిచేస్తున్న 162 మంది సిబ్బందిని రెగ్యులర్ చేయాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు. మిగిలిన 200 మందికి మినిమమ్ టైంస్కేల్ వర్తింపచేస్తూ నిర్ణయం.
* తితిదే విద్యాసంస్థల్లో పనిచేస్తున్న 382 మంది కాంట్రాక్టు టీచర్లు, లెక్చరర్లకు, కల్యాణకట్టలోని 246 మంది పీస్‌రేట్ క్షురకులకు మినిమమ్ టైంస్కేల్ వర్తింపు.
* తితిదే శాశ్వత ఉద్యోగులకు రూ.14 వేలు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రూ.6,850/- బ్రహ్మోత్సవ బహుమానం అందించేందుకు నిర్ణయం.
* తిరుపతిలోని అలిపిరి వద్ద 200పైగా ఎకరాల విస్తీర్ణంలో శ్రీవారి భక్తి ధామం నిర్మించేందుకు నిర్ణయం.
* తిరుమలకు నీటి సమస్య అరికట్టేందుకు బాలాజీ రిజర్వాయర్ నిర్మాణానికి అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపాలని నిర్ణయం.
* తితిదేలో పదవీ విరమణ పొందిన అర్చకుల సేవలు తిరిగి ఏ విధంగా వినియోగించుకోవాలనే విషయంపై విధి విధానాలు రూపొందించేందుకు కమిటీ.
* మతమార్పిడులు అరికట్టేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు శ్రీవాణి ట్రస్టు ద్వారా విరాళాలు సేకరించేందుకు నిర్ణయం.