చిత్తూరు జిల్లా శాంతిపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని ఓ తరగతి గదిలో... విషసర్పాన్ని చూసి విద్యార్థులు భయాందోళనలకు గురయ్యారు. తరగతి గది నుంచి బయటికి పరుగులు తీశారు. ఉదయాన్నే పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు అనుకోకుండా ఎదురైన ఈ ఘటనతో విస్తుపోయారు. వెంటనే ఉపాధ్యాయులకు, స్థానికులకు సమాచారం అందించారు. పాఠశాలకు చేరుకున్న ఉపాధ్యాయులు తరగతి గదిలో నక్కి ఉన్న పామునైతే గుర్తించారు కానీ, అది అత్యంత విషపూరితమైన సర్పంగా గుర్తించి చంపటానికి వెనకాడారు. స్థానికులు, ఉపాధ్యాయులు మల్లగుల్లాలు పడుతున్న సమయంలో ఓ పూర్వ విద్యార్థి సాహసించి ఆ పాముని చంపేయగా.. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తరగతి గదిలో నెలల తరబడి మధ్యహ్నా భోజన పథకానికి సంబంధించిన బియ్యన్ని భద్రపరుస్తున్నారు. నిర్వహణ లోపం కారణంగా ఎలుకలు చేరి, బియ్యాన్ని పాడు చేస్తున్నా ఏ అధికారి పట్టించుకోలేదు. ఎలుకలు తినటానికి వచ్చిన పాము బయటపడిన సందర్భంలో.. ఇలా ప్రాణాలు కోల్పోయింది. ఇప్పటికైనా తరగతి గదిలో ఉన్న బియ్యాన్ని మరో చోటికి మార్చాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: