వేసవి వచ్చిందంటే చాలు మనుషుల దాహాన్ని తీర్చేందుకు వీధికో చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంటారు. మరి...పశువులు, జంతువుల దాహాన్ని ఎవరు తీరుస్తారంటే మాత్రం చెప్పలేని పరిస్థితి. రోడ్లపై ఎక్కడైనా నీటి జాడ కనిపిస్తుందా..?అంటే అదీకూడా కనిపించదు. అలాంటి పరిస్థితుల్లో జంతువులకు ప్రాణం ఉంటుందనీ, వాటికి దాహం వేస్తుందని, అవి నీటి కోసం అలమటిస్తాయని గుర్తించి దప్పికను తీర్చే ప్రయత్నం చేశారు చిత్తూరుకు చెందిన ప్రతాప్ కుమార్ రెడ్డి.
20 గ్రామాలకు ఆ తొట్టెలే దిక్కు
చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం కె.రెడ్డివారిపల్లి గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యడు రెడ్డివారి ప్రతాప్ కుమార్ రెడ్డి మూగజీవాల దాహం తీరుస్తున్నారు. తమ గ్రామ పరిధిలోని బండలు గుట్టలపై ఏటవాలుగా నీటితొట్టెలు నిర్మించి నీటిని నింపుతున్నారు. బండలపై లోత్తెన చోట ట్యాంకర్ల ద్వారా నీటిని నింపిస్తున్నారు. ఈ నీటి తొట్టెలే దాదాపు ఆ గ్రామానికి చుట్టుపక్కల ఉన్న 20 గ్రామాలకు చెందిన పశువులు, గొర్రెల, మేకలకు తాగునీరు అందుతోంది.
ఎటు చూసిన కరవు ఛాయలే..
పీలేరు నియోజకవర్గంలో కరవు ఛాయలు అలుముకున్నాయి. గ్రామాల్లో చెరువులు, కుంటలన్నీ ఎండిపోయాయి. కనుచూపు మేర చుక్కనీరు కనిపించే పరిస్థితుల్లేవు. భూమి సైతం గుల్లబారి పాడి పశువులకు మేత కరువైంది. కంప ఆకులు, ఎండు గడ్డి తిని బతుకుతున్నాయి. ఈ పరిస్థితుల్లోనే ప్రతాప్ కుమార్ రెడ్డి ముందుకొచ్చి శభాష్ అనిపించుకున్నారు.
వెయ్యి అడుగుల మేర బోర్లు వేసినా నీళ్లు పడని ఈ ప్రాంతంలో ప్రతాప్ కుమార్ రెడ్డికి.. తన గ్రామంలో వేసిన బోరులో నీళ్లు సమృద్ధిగా లభిస్తున్నాయి. ఈ నీటినే మూగజీవాలకు ట్యాంకర్ల ద్వారా తరలిస్తున్నారు. కె.రెడ్డివారిపల్లి గ్రామం, గుట్టపాలెం పంచాయతీల పరిధిలోని మూగజీవాలకు గత ఐదు నెలలుగా దాహాన్ని తీరుస్తున్నారు.