జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేపట్టిన రాయలసీమ ఆత్మీయ యాత్రలో భాగంగా... చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఆయన పర్యటించారు. తొలుత మార్కెట్ యార్డులో టమాటా రైతులతో ముఖాముఖి నిర్వహించిన పవన్... ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగాలం శ్రమించి పంట పండిస్తే... ఎందుకు వారిని ఆదుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. మతమార్పిడిపై ఉన్న శ్రద్ధ... రైతులపై ఎందుకు లేదని సీఎం జగన్‌ను పవన్ ప్రశ్నించారు. రైతులను కలవనీయకుండా అడ్డుకున్న వైకాపా... తన గొయ్యి తానే తవ్వుకుంటోందని మండిపడ్డారు.
'చేనేతను బ్రాండ్‌గా చేస్తే... నేనే అంబాసిడర్'
చేనేత కార్మికులతో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న పవన్ కల్యాణ్... వారిని కార్మికుల కన్నా కళాకారులుగా గౌరవించాలని అభిప్రాయపడ్డారు. చేనేతను బ్రాండ్‌గా చేస్తే... తానే అంబాసిడర్‌గా ఉంటానని చెప్పారు. చేనేత కోసం మెగా క్లస్టర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వెలుగు యానిమేటర్లు, మహిళా సంఘాల సభ్యులతో సమావేశమయ్యారు. కొత్త ఉద్యోగాల పేరుతో వైకాపా ఉన్న కొలువులు తీసేస్తోందని ఆరోపించారు.
'డబ్బు ఎక్కువైతే పోరాడే శక్తి తగ్గుతుంది'
తెదేపా, భాజపా, జనసేన రాజకీయంగా విడిపోయాయని... ఒకసారి విడిపోయిన తర్వాత మళ్లీ కలవడం తనకు నచ్చదని పవన్ అన్నారు. అనంతపురం, హిందూపురం లోక్‌సభ నియోజకవర్గాల పార్టీ కార్యకర్తలతో పవన్ సమీక్ష నిర్వహించారు. డబ్బు ఎక్కువుంటే పోరాడే శక్తి తగ్గిపోతుందనే... తాను ధనసంపాదనపై దృష్టి పెట్టలేదన్నారు. దేశం కోసం పోరాడటమే లక్ష్యంగా బతికే ఆర్ఎస్ఎస్ నేతలతో పోటీపడలేమని పవన్ అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాను చేసే పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.