ఆలయాలలో ఘనంగా పూజలు...వైభవంగా ఉత్సవాలు....
విశాఖ జిల్లా...
విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో గజేంద్రమోక్ష ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఉత్సవం చాలా ప్రధానమైనది. ప్రతిఏటా కనుమ పండుగ రోజున స్వామివారు మెట్ల మార్గం ద్వారా పూలతోటలో ఉత్సవ నిర్వహించడం ఆనవాయితీ. స్వామివారిని సుప్రభాతసేవతో మేల్కొలిపి విశేష పూజలు చేశారు. అనంతరం సాయంకాలం సమయాన అప్పన్న మెట్ల మార్గం ద్వారా స్వామివారిని పల్లకిలో తీసుకొని వచ్చి పూల తోటలో గోవిందరాజు అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ గజేంద్రమోక్ష ఉత్సవం మొసలి బారి నుంచి గజేంద్రుని రక్షించే దృశ్యాన్ని బొమ్మల ద్వారా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. ఉత్సవం సందర్భంగా సాయంత్రం 6 గంటల నుంచి స్వామి దర్శనాలు నిలుపుదల చేశారు.
చిత్తూరు జిల్లా..
కనుమ పండుగ సందర్భంగా ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం శ్రీరంగరాజపురం మండలం ఆరిమాకులపల్లె గంగమ్మ గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా అలంకరించి పూజకు సిద్ధం చేశారు. భక్తులు డప్పు వాయిద్యాలు బాణసంచా పేలుళ్ల మధ్య ప్రదర్శనగా చేరుకుని అమ్మవారికి పొంగలి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మవారి ఆలయం పరిసరాలు కిక్కిరిసిపోయాయి. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు అమ్మవారి పూజలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
ప్రకాశం జిల్లా...
ప్రకాశం జిల్లా అద్దంకి మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సింగరకొండలోని భవనాశి చెరువులో తెప్పోత్సవ కార్యక్రమాన్ని కన్నులపండువగా నిర్వహించారు. ప్రదక్షిణల అనంతరం ప్రసన్నాంజనేయ స్వామి, లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవ మూర్తులను భవనాశి చెరువు వద్ద ప్రత్యేక పూజలు, కూష్మాండబలిహరణ చేశారు. హంస వాహనంపై ఉత్సవమూర్తులను ఉంచి ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భవనాశి చెరువు వద్ద ఏర్పాటు చేసిన కోలాట ప్రదర్శన భక్తులను ఎంతగానో అలరించింది. తెప్పోత్సవం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చెరువులో రెండు ప్రత్యేక పడవలను గజ ఈతగాళ్లు ఏర్పాటు చేశారు.
నెల్లూరు జిల్లా ....
కుమ్మరి కుంటలో....
నెల్లూరు జిల్లా వెంకటగిరిలో కుమ్మరికుంట పుష్కరిణిలో సాయిబాబా తెప్పోత్సవం ఘనంగా జరిగింది. ప్రతి ఏటా కనుమ పండుగ రోజున ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా బాబా ఆలయంలో పాట కచేరి అలరించింది.
గూడూరులో..
గూడూరులోని కోనేటి మిట్టలో వెలసిన్న శ్రీ కోదండరామ ఆంజనేయ స్వామి కోనేరులో ధనుర్మాసం సందర్భంగా ఘనంగా తెప్పోత్సవం నిర్వహించారు. శ్రీ కనుమూరు హరిచంద్రరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీరాములవారికి అగ్నిహోమం, పూజా కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు శాసనసభ్యుడు వెలగపల్లి వరప్రసాద్ రావు , మాజీ శాసనసభ్యుడు పాశం సునీల్ కుమార్, శ్రీ కనుమూరి హరిచంద్ర రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధినేత కనుమూరు హరిచంద్ర రెడ్డి, రవిచంద్రారెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు.
కర్నూలు జిల్లా...
కర్నూలు జిల్లా అహోబిలంలో లక్ష్మీనరసింహస్వామి పార్వేట ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పల్లకిలో కొలువైన జ్వాల నరసింహ మూర్తి, ప్రహ్లాదుడికి విశేష పూజలు నిర్వహించారు. స్వామి 40 రోజుల పాటు పల్లకిలో కొలువై ఆళ్లగడ్డ పరిధిలోని 36 గ్రామాలలో తిరగనున్నారు. ఈ యాత్రలో స్వామియే స్వయంగా తన భక్తుల వద్దకు వెళ్లి తన కల్యాణోత్సవానికి ఆహ్వానాన్ని అందించనున్నారు. ఇలాంటి వృత్తాంతం ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా అహోబిలంలో ఉండటం విశేషం. ఈ 40 రోజుల పాటు స్వామి తాను వెళ్లిన గ్రామంలో భక్తులచే విశేష పూజలు అందుకుంటారు. అహోబిల లక్ష్మీ నరసింహ స్వామిని... చెంచులు తమ బావగా భావిస్తారు. అందుకే స్వామి రాక పురస్కరించుకొని చెంచులు పల్లకి ముందు నృత్యాలు చేస్తూ విల్లుతో బాణాల సంధిస్తూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి స్వామి పల్లకి మోశారు.
సంక్రాంతి, కనుమ పండగ సంబరాలు...
చిత్తూరు జిల్లా ...
రామకుప్పంలో
చిత్తూరు జిల్లా రామకుప్పం మండల కేంద్రంలో సంక్రాంతి, కనుమ సంబరాలు ఘనంగా నిర్వహించారు. పశువుల పరుగు పందేలు వీక్షించడానికి ప్రజలు తరలివచ్చారు. జనం వేల సంఖ్యలో తరలిరావడంతో రామకుప్పం జనసందోహంగా మారింది.
పీలేరులో
జిల్లాలోని పీలేరు నియోజకవర్గంలో సంక్రాంతి కనుమ పండుగను ఘనంగా జరుపుకున్నారు. పశువులను నీటితో శుభ్రం చేయించి కొమ్ములకు రంగులు వేసి అలంకరించారు. మహిళలు పశువులకు పూజలు నిర్వహించారు. అనంతరం పశువులను బెలూన్లతో అలంకరించి గ్రామ శివార్లలోని కాటమరాయుడు వద్దకు తీసుకెళ్లి పూజలు చేశారు. చిట్ల కుప్పకు నిప్పంటించి ... అగ్నిని పశువులకు చూపించారు. సూర్యోదయానికి ముందే గ్రామంలో సాంప్రదాయం ప్రకారం ప్రతి ఇంటి నుంచి సల్లను కాసేపు ఇంట్లోని గడపలపై ఉంచి (వేపాకు, దోస, అన్నం) అనంతరం సల్లను తీసుకెళ్లి బావులు, చెరువులు, కుంటల్లోని నీటిలో పడవేశారు. కనుమ పండుగ సందర్భంగా నిర్వహించిన గంగిరెద్దు ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.
కడప జిల్లా ...
కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రైల్వే కోడూరు, ఓబులవారిపల్లి, పెనగలూరు, చిట్వేలి, పుల్లంపేట, మండలాలలో గొబ్బెమ్మ పండుగలు ప్రతి గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. రైల్వే కోడూరులో మహిళలు పెద్ద ఎత్తున గొబ్బెమ్మలకు పూజచేసి.... కోలాటాలు వేస్తూ, ఏటికీ సాగనంపే కార్యక్రమం చేశారు.
నెల్లూరు జిల్లా ....
పడమటి నాయుడుపల్లిలో
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పడమటి నాయుడుపల్లిలో గొబ్బెమ్మ జాతర కనుల పండుగగా జరిగింది. తప్పెట్ల సందడితో ప్రజలు చిందులేస్తూ గొబ్బెమ్మను ఊరు దాటించారు. ఊరికి దగ్గరలో ఉన్న కేతమన్నేరు వాగులో నిమజ్జనం చేశారు. ఈ పండుగను 20 ఏళ్ల నుంచి కనుమ పండుగ రోజు చేయటం ఆనవాయితీ. గొబ్బెమ్మ జాతర చేయటం వలన గ్రామానికి మంచి జరుగుతుందని ప్రజల నమ్మకం.
నాయుడుపేటలో
నాయుడుపేట స్వర్ణముఖి నదిలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య బెలూన్ గాల్లోకి వదిలి పండుగ ఉత్సవాలు మొదలుపెట్టారు. నదికి భారీగా సందర్శకులు చేరుకున్నారు. ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ... సంక్రాంతి సంబరాలు జరుపుకునేందుకు సీఎం జగన్ రూ.15వేలు అందించారన్నారు. మూడు రోజులు సంతోషంగా ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రకాశం జిల్లా ...
ప్రకాశం జిల్లాలో కనుమ సంబరాలు కన్నులపండువగా జరిగాయి.. చిన్నగంజాం మండలం గొనసపూడి గ్రామంలోని కూడలిలో ఉన్న అభయాంజనేయ స్వామి విగ్రహం వద్ద మహిళలు, రైతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భముగా ఏర్పాటుచేసిన కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది.
సాంస్కృతిక కార్యక్రమాలు ...
తూర్పు గోదావరి జిల్లా....
సంక్రాంతి పండుగ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సినీ గేయాలు ఆలపించారు. హీరోల సినిమా పాటలకు డాన్సర్లతోపాటు స్థానిక యువకులు స్టెప్పులు వేశారు.
విశాఖ జిల్లా...
విశాఖలో త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ ఆద్వర్యంలో త్యాగరాజ స్వామి వారి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. అనేక మంది కళాకారులు త్యాగరాజ స్వామిని ఆరాధిస్తూ కచేరి నిర్వహించారు. సంప్రదాయ వస్త్రధారణలో సకుటుంబ సమేతంగా కచేరీల్లో పాలుపంచుకున్నారు. మూడు రోజుల నుంచి 173 మంది కళాకారులు 71 కచేరీలు చేశారు . ఎంఎస్ఎన్ మూర్తి, ద్వారం దుర్గాప్రసాదరావు వయోలిన్ కచేరి అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసింది.