పోరాడాలన్న లక్ష్యం నీకుండాలే కానీ... ప్రపంచమంతా ఏకమైనా ఎదిరించవచ్చన్న చేగువేరా మాటలే ఆమెకు స్ఫూర్తి మంత్రం. జీవితంలో స్పష్టమైన నిర్ణయాలు తీసుకునేంత వయసు, వాటి ఫలితాలను బేరీజు వేసేంత అనుభవం లేకున్నా.. పుట్టి పెరిగిన పరిస్థితులే ఆమెను లక్ష్యాన్ని నిర్దేశించుకునేలా చేశాయి. తన తల్లి దేవదాసీ కావడం వలన అందరు చిన్నారుల్లా హాయిగా ఆడుకుంటూ, చదువుకుంటూ, మనసుకు నచ్చిన నిర్ణయం తీసుకునేంత స్వేచ్ఛలేకపోయిన... తన లక్ష్యంకోసం పోరాడుతుంది.
ఆరో తరగతిలో తొలిఅడుగు
చిత్తూరు జిల్లా చంద్రగిరి తాలుకా తొండవాడ హరిజనవాడకు చెందిన కొండా రేణుక అలియాస్ మాతమ్మకు నలుగురు సంతానం. దేవదాసీ వ్యవస్థ నియమాల ప్రకారం భర్త వదిలేయటం వలన నలుగురు పిల్లలతో... ఊరుచివర కూలిపోయేలా ఉన్న ఓ అద్దె ఇంటిలో నివాసం ఉంటోంది మాతమ్మ. ఆమె రెండో సంతానమే కొండా సుశీల. ఆరో తరగతిలో ఓ ఉపాధ్యాయురాలి చేతిలో చూసిన హాకీస్టిక్‌తో మొదలైన తన ప్రస్థానం... నేడు ఆమెను జాతీయస్థాయి క్రీడాకారిణిగా మార్చింది.
ఉపాధ్యాయుల సాయంతో
కఠినసాధన చేస్తూ అంచెలంచెలుగా ఎదిగింది సుశీల... ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలో మదనపల్లెలో జరిగిన జిల్లా, రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లో ప్రతిభ చూపింది. ఆ పోటీల్లో చూపిన ప్రతిభతో అండర్-17 విభాగంలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. అక్కడా విశేషంగా రాణించింది. పేదరికం అనుభవిస్తున్నా ఎన్నడూ ఆటను నిర్లక్ష్యం చేయలేదు. కాలం ఏదైనా, సదుపాయాలు అంతగా లేకున్నా సాధనచేసింది. సుశీల ప్రతిభ చూసి... ఉపాధ్యాయులు చందాలు ఇచ్చి, పోటీలకు పంపేవారు.
50 కి పైగా పతకాలు
జిల్లా, రాష్ట్రస్థాయిలో తన సత్తాను చూపించిన సుశీలు.. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. అండర్-17, అండర్-19 జూనియర్, సీనియర్ విభాగంలోనూ రాణించింది. తన కష్టాలకు ప్రతిఫలంగా ఎన్నో అవార్డులు, రివార్డులు, ప్రశంసపత్రాలను అందుకుంది. 50కి పైగా రాష్ట్ర, జాతీయ స్థాయి పతకాలను కైవసం చేసుకుంది.
రజినీ రోల్ మోడల్
వసతులు లేకున్నా, కఠోరమైన పరిస్థితుల్లో సాధన చేస్తూ జాతీయ మహిళా హాకీ జట్టులో చోటు సంపాదించే లక్ష్యంతో శరవేగంగా అడుగులేస్తోంది. ఇదే చిత్తూరు జిల్లా నుంచి జాతీయ మహిళా హాకీ జట్టుకు గోల్‌కీపర్‌గా సేవలందిస్తున్న రజినీని రోల్ మోడల్‌గా తీసుకుని సాధన చేస్తుంది. సుశీల పరిస్థితులు చూసిన అధికారులు ఆమెకు తిరుపతి వసతిగృహంలో సదుపాయం కల్పించారు. అక్కడ ఉంటూ ప్రాక్టీస్ చేసుకునే అవకాశం మాత్రమే అధికారులు కల్పించారు. సరైన ఆహారం అందకపోవటం వలన అంతర్జాతీయ క్రీడాకారిణి ఎదగాల్సిన సుశీల....ఫిట్నెస్ అవరోధాలను ఎదుర్కొటుంది. రజినీని అంతర్జాతీయ క్రీడాకారిణిగా తీర్చిదిద్దటంలో కీలకపాత్ర పోషించిన ఆంధ్రా హాకీ అసోసియేషన్ కార్యదర్శి ప్రసన్న కుమార్ రెడ్డి... సుశీలను అదే తరహాలో తీర్చిదిద్దే బాధ్యతను తీసుకున్నారు. శాప్ నుంచి కోచ్‌లను రప్పించి... వారికి వీలున్న సమయంలో సుశీలకు శిక్షణనిచ్చేలా అవకాశాన్ని కల్పించారు.
అమ్మ కష్టానికి బహుమతి
ఓ పక్క హాకీలో జాతీయ స్థాయి క్రీడాకారిణి రాణిస్తూనే మరో పక్క తన తల్లి ఎదుర్కొన్న సమస్యలపై సుశీల ధైర్యంగా పోరాడుతుంది. దేవదాసీ వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు కృషి చేస్తుంది. కష్టతరమైన ప్రయాణం, తోడున్న వాళ్లు ఎవరూ లేరు... అయినా పట్టువదలక పోరాడుతున్న సుశీల ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది. ప్రభుత్వం చేయూతనిస్తే... అతి త్వరలోనే జాతీయ జట్టులో స్థానం సంపాదించి అంతర్జాతీయస్థాయి క్రీడాకారిణిగా రాణించి దేశానికి మంచిపేరు తీసుకురావటంతో పాటు... అమ్మ కష్టానికి బహుమతి ఇస్తానంటూ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తోంది.
ఇదీ చదవండి :